CBSE: సీబీఎస్‌ఈ బోర్డు కీలక నిర్ణయం.. పాఠశాలలకు నచ్చిన భాష ఎంచుకునే అవకాశం

ఇక నుంచి ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు తమకు నచ్చిన భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా ఎంచుకునేందుకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(CBSE) పాఠశాలలకు అనుమతించింది.

Published : 22 Jul 2023 02:44 IST

దిల్లీ: దేశంలో అన్ని మాతృభాషలను ప్రోత్సహించేవిధంగా కీలక అడుగు పడింది. జాతీయ విద్యావిధానం పాలసీ(NEP)ని ప్రోత్సహించే విధంగా సీబీఎస్‌ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు తమకు నచ్చిన భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా ఎంచుకునేందుకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(CBSE) పాఠశాలలకు అనుమతించింది. ప్రస్తుతం మెజారిటీ సీబీఎస్‌ఈ పాఠశాల్లలో ఆంగ్లంలో బోధిస్తుండగా కొన్ని పాఠశాల్లలో మాత్రమే హిందీలో బోధన సాగుతోంది. ఇప్పటి వరకు సీబీఎస్‌ఈ పాఠశాల్లలో భారతీయ భాషల్లో బోధించేందుకు అనుమతి లేదు. తాజా ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలు తమకు నచ్చిన భారతీయ భాషల్లో బోధనను కొనసాగించవచ్చు. ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(UGC) ఉన్నత విద్యలో సైతం మాతృభాషల్లో బోధించేందుకు ఇలాంటి ఉత్తర్వులనే జారీ చేసింది. 

ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే భారతీయ భాషా సమితి అధ్యక్షుడు చాము కృష్ణ శాస్తి అన్నారు. ఈ నిర్ణయంతో బోధన, అభ్యాసరీతులు భారతీయీకరణం చెందడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలు వస్తాయన్నారు. ప్రస్తుతం వృత్తిపరమైన విద్యలో ప్రాంతీయ భాషలను యూజీసీ అందుబాటులోకి తేగా, ఇప్పుడు పాఠశాల స్థాయిల్లో స్థానిక భాషలను ఐచ్ఛికంగా ఎంచుకునేందుకు సీబీఎస్‌ఈ కూడా ఈ అవకాశం కల్పించిందని అన్నారు. నేషనల్‌ ఎడ్యుకేషన్ పాలసీని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఈ నిర్ణయం ఎంతో ముఖ్యపాత్ర వహిస్తుందని శాస్త్రి అన్నారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌ ఈ నిర్ణయంపై సీబీఎస్‌ఈను అభినందించారు. పాఠశాల స్థాయిలో మాతృభాష, భారతీయ భాషల్లో ప్రోత్సహించే అభినందన చర్య అని ట్వీట్‌ చేశారు. పాఠశాలల్లో ఐచ్ఛిక బోధనా మాధ్యమాన్ని అమలు చేయడం వల్ల సవాళ్లు సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని సీబీఎస్‌ఈ పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని