బర్డ్ ఫ్లూ: రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌ 

పలు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Updated : 06 Jan 2021 13:07 IST

పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్ 

దిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుత పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. అలాగే ఫ్లూ నివారణ చర్యలు, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర పాడి పశుసంవర్థకశాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. 

రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లలో బర్డ్‌ ఫ్లూ కారణంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో పక్షులు మృత్యువాతపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్‌లో వైరస్ కేసులు వెలుగుచూడటంతో జమ్మూకశ్మీర్ యంత్రాంగం అప్రమత్తమైంది. అలాగే హరియాణాలోని పంచకుల జిల్లాలో గత పది రోజుల్లో నాలుగు లక్షలకుపైగా కోళ్లు మరణించాయి. అయితే, వాటిలో బర్డ్‌ ఫ్లూ వైరస్ నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా..కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో దాదాపు 1700 బాతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. దాంతో ఇతర ప్రాంతాలకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా మందుస్తు జాగ్రత్తగా కోళ్లు, బాతులను చంపే ప్రక్రియకు అధికారులు ఉపక్రమించారు. దీనికింద 40 వేలకు పైగా కోళ్లు, బాతులను వధించాల్సి ఉంటుందని సమాచారం. మరోవైపు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాయి. 

ఇవీ చదవండి:

బర్డ్‌ ఫ్లూపై అప్రమత్తమైన రాష్ట్రాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని