Omicron Wave: అదుపులోనే వైరస్‌.. కొవిడ్‌ ఆంక్షలు సడలించండి!

కేసులు, పాజిటివిటీ రేటును బట్టి ఆంక్షల్లో మార్పులు చేయడమా లేక పూర్తిగా ఎత్తివేయడమా అనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Published : 17 Feb 2022 02:25 IST

పరిస్థితిని సమీక్షించి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలన్న కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ కార్యకలాపాలపై ఆయా రాష్ట్రాలు విధించిన ఆంక్షలపై పునఃసమీక్ష చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. కేసులు, పాజిటివిటీ రేటును బట్టి ఆంక్షల్లో మార్పులు చేయడమా లేక పూర్తిగా ఎత్తివేయడమా అనే నిర్ణయాన్ని తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలు రాసింది.

‘వైరస్‌ కట్టడిని సమర్థవంతంగా కొనసాగించడంతోపాటు ప్రజలు, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగడం కూడా అంతే ముఖ్యం. రాష్ట్రాల సరిహద్దుల వద్ద విధించిన ఆంక్షలు వీటికి ఆటంకం కాకూడదు. అందుకే కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటును పునఃసమీక్షించుకోవాలి. వాటిని బట్టి ఆంక్షలు సడలించడం/ పూర్తిగా ఎత్తివేయడంపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ వెల్లడించారు. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పడుతోందన్న ఆయన.. అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న మార్గదర్శకాలపై ఇటీవలే సమీక్ష నిర్వహించామన్నారు. ఇందుకు సంబంధించి నూతన మార్గదర్శకాలను ఫిబ్రవరి 10న విడుదల చేశామని పేర్కొన్నారు. ఆంక్షలు సడలిస్తున్నప్పటికీ కొవిడ్‌ కట్టడికి ఐదు అంచెల వ్యూహాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తూనే ఉండాలని స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, జనవరి నెలలో దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి అధికంగా ఉంది. జనవరి 21న గరిష్ఠంగా కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. దేశవ్యాప్తంగా గతవారం సరాసరి 50వేలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం రోజువారీ కరోనా కేసుల సంఖ్య 30వేలకు తగ్గింది. గడిచిన 24గంటల్లో మొత్తం 27వేల పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు 3.6శాతానికి తగ్గిపోయింది. దీంతో ఆయా రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షలను సడలించే పనిలో నిమగ్నమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని