Viral video: కుర్చీలోనే కుప్పకూలిన వ్యక్తి.. సీపీఆర్‌ చేసి కాపాడిన IAS అధికారి!

అకస్మాత్తుగా కుర్చీలో కూలిపోయిన ఓ వ్యక్తికి సీపీఆర్‌ చేసి కాపాడారు ఓ ఐఏఎస్‌ అధికారి. చండీగఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 19 Jan 2023 01:39 IST

చండీగఢ్‌: అకస్మాత్తుగా కుర్చీలోనే కుప్పకూలిన ఓ వ్యక్తికి సకాలంలో సీపీఆర్‌ చేసి ప్రాణదాతగా నిలిచారు ఐఏఎస్‌ అధికారి యశ్‌పాల్‌ గార్గ్‌. చండీగఢ్‌(Chandigarh)లో ఆరోగ్యశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న గార్గ్‌.. మంగళవారం కార్డియా పల్మనరీ రీసస్కిటేషన్‌(సీపీఆర్‌)(cardiopulmonary resuscitation) ప్రక్రియతో వ్యక్తిని కాపాడి ప్రశంసలు అందుకొంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చండీగఢ్‌లో సెక్టార్‌ 41కి చెందిన జనక్‌ లాల్‌ అనే వ్యక్తి మంగళవారం ఉదయం చండీగఢ్‌ హౌసింగ్‌ బోర్డు (సీహెచ్‌బీ) కార్యాలయానికి వచ్చారు. అకస్మాత్తుగా కూర్చున్నచోటే కుప్పకూలిపోయారు(గుండెపోటుగా అనుమానం). దీంతో సమాచారం తెలుసుకున్న వెంటనే తన సీట్లోంచి పరుగెత్తుకొని వచ్చిన ఐఏఎస్‌ అధికారి యశ్‌పాల్‌ గార్గ్‌.. సీపీఆర్‌ చేసి ఆ వ్యక్తి ప్రాణాల్ని కాపాడారు. ఈ వీడియోను దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

‘‘ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో చండీగఢ్‌ ఆరోగ్యశాఖ కార్యదర్శి యశ్‌పాల్‌ గార్గ్‌ జీ తక్షణమే సీపీఆర్‌ చేసి అతడి ప్రాణాల్ని కాపాడారు. ఆయన చేసిన పని ఎంతో ప్రశంసనీయం. గుండెపోటు నుంచి ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరూ సీపీఆర్‌ నేర్చుకోవాలి’’ అని స్వాతి మాలివాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.  సీపీఆర్‌ అందించడంతో ఆ వ్యక్తి వెంటనే స్పృహలోకి వచ్చారు. ఈ ఘటనపై ఐఏఎస్‌ అధికారి యశ్‌పాల్‌ గార్గ్‌ స్పందించారు. ‘‘నేను నా గదిలో ఉన్నప్పుడు పబ్లిక్‌ రిలేషన్స్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ తివారీ పరుగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు. ఎవరో వ్యక్తి సీహెచ్‌బీ సెక్రటరీ ఛాంబర్‌ వద్ద కుప్పకూలిపోయాడని చెప్పారు. వెంటనే అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లి అతడికి సీపీఆర్‌ అందించాను’’ అని వివరించారు. అయితే, జనక్‌లాల్‌కు సీపీఆర్‌ అందించిన తర్వాత సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. ఈసీజీ తీసి.. ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని