Bharat Jodo Yatra: జోడో యాత్రలో కుప్పకూలి.. కాంగ్రెస్‌ ఎంపీ మృతి

భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఎంపీ సంతోఖ్‌ సింగ్‌ హఠాన్మరణం చెందారు. యాత్రలో నడుస్తున్నప్పుడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.

Updated : 14 Jan 2023 12:26 IST

చండీగఢ్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న ‘భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)’లో విషాదం చోటుచేసుకుంది. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్‌ (Congress) ఎంపీ సంతోఖ్‌ సింగ్‌ చౌధరీ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం భారత్‌ జోడో యాత్ర పంజాబ్‌లోని ఫిలౌర్‌ ప్రాంతంలో కొనసాగుతోంది. శనివారం ఉదయం ఈ యాత్రలో పాల్గొని రాహుల్‌ గాంధీతో కలిసి నడిచిన జలంధర్‌ ఎంపీ సంతోఖ్‌ సింగ్ (‌Santokh Singh Chaudhary).. ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనను లూధియానాలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎంపీ మరణవార్త తెలియగానే రాహుల్‌ గాంధీ యాత్రను నిలిపివేసి హుటాహుటిన ఆసుపత్రికి బయల్దేరారు.

సంతోఖ్‌ సింగ్‌.. 1946 జూన్‌ 18న జలంధర్‌లోని ధలివాల్‌ ప్రాంతంలో జన్మించారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ హయాంలో కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జలంధర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.

ప్రముఖుల సంతాపం..

ఈ ఘటనపై రాహుల్‌ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘సంతోఖ్‌ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఎంతో కష్టపడి పనిచేసే నాయకుడు. కాంగ్రెస్‌ కుటుంబానికి బలమైన వ్యక్తి. యూత్‌ కాంగ్రెస్‌ నుంచి పార్లమెంట్‌ సభ్యుని వరకు తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. ఈ శోక సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని రాహుల్‌ ట్వీట్ చేశారు. జోడో యాత్రలో సంతోఖ్‌తో కలిసి నడిచిన ఫొటోలను షేర్‌ చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కూడా ఎంపీ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సంతోఖ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని