Fake News: నిబంధనలు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం : రిజిజు

అసత్య, తప్పుదోవ పట్టించే వార్తలను గుర్తించేందుకే నిబంధనల్లో మార్పులకు ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు పేర్కొన్నారు. అయితే, ఇది అమలులోకి రావడానికి అనేక సంప్రదింపులు అవసరమన్నారు. 

Updated : 09 Apr 2023 16:11 IST

దిల్లీ: అసత్య, తప్పుడు వార్తలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫేక్‌ న్యూస్‌ను గుర్తించేందుకు ఇప్పటివరకు ఉన్న నిబంధనలను సవరించేందుకు సంప్రదింపుల ప్రక్రియ నడుస్తోందన్నారు. వీటిని అమలులోకి తీసుకురావడానికి ముందు అనేక చర్చల అవసరముందన్నారు. జమ్మూ కశ్మీర్‌లో జరిగన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తప్పుడు వార్తల కట్టడిపై కేంద్రం పని చేస్తోందని అన్నారు.

‘మొత్తం ఎన్నికల పద్ధతిలోనే కొన్ని మార్పులు తేవాలని చూస్తున్నాం. దీనిపై ఎటువంటి హామీ ఇవ్వలేను. ఎందుకంటే దీనిపై ప్రస్తుతం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. నకిలీ, తప్పుడు వార్తలు, తప్పుదోవ పట్టించే సమాచారం వంటి ముఖ్యమైన వాటిని నిర్వచించాలంటే సుదీర్ఘమైన ప్రక్రియ అవసరం. వాటిని గుర్తించే పనిలోనే ఉన్నాం’ అని పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల్లో భాజపాను ఎదుర్కోవాలంటే విపక్షాల ఐక్యత అవసరముందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా పిలుపునివ్వడంపై స్పందించిన రిజుజు.. అధికారంలో ఉన్న ప్రభుత్వం బలంగా ఉందనే విషయం ఆయన ప్రకటన రుజువు చేస్తోందన్నారు. జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ప్రశ్నించగా.. నిర్ణీత సమయంలో ఎన్నికలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ సవరణ రూల్స్‌కు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం, ప్రభుత్వానికి సంబంధించి నకిలీ, అసత్య లేదా తప్పుదోవ పట్టించే ఆన్‌లైన్‌ కంటెంట్‌ గుర్తించేందుకు గాను ప్రభుత్వం ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసుకునే అధికారం ఉంటుంది. ఆ యూనిట్‌ గుర్తించిన వార్తలను సదరు సోషల్‌ మీడియా సంస్థలు తొలగించాలి. నిబంధనలను అతిక్రమించే సంస్థలు ‘సేఫ్‌ హార్బర్‌’ ఇమ్యూనిటీ కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని