UPSC: యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్‌ జాబ్‌ ఆఫర్‌

UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్‌ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది.

Updated : 19 Apr 2024 16:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపీఎస్సీ (UPSC) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఎంపిక కావడం సాధారణ విషయం కాదు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు ఏటా లక్షల మంది సన్నద్ధమవుతుంటారు. కానీ, ఖాళీలు మాత్రం 1000కి అటుఇటుగా మాత్రమే ఉంటాయి. ర్యాంకర్లను మినహాయిస్తే మిగిలినవారికి నిరాశ తప్పదు.

అలాంటివాళ్లు ఏళ్ల పాటు చేసిన శ్రమను చూసిన వారికి సానుభూతి కలగక మానదు. జీవితంలో కీలక సమయాన్ని పరీక్ష సన్నద్ధత కోసం వెచ్చించిన వాళ్లకు మరో మార్గంలో నడవడం అంత సులభమైన విషయం కాదు. అలాంటివారిని దృష్టిలోఉంచుకొని ‘డిట్టో ఇన్సూరెన్స్‌’ ప్రత్యేక నియామక ప్రక్రియను ప్రకటించింది. యూపీఎస్సీలో (UPSC) తృటిలో అవకాశం కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకువచ్చింది. వారు చేసిన కృషి, పట్టుదలకు గుర్తింపుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సంస్థలో జిరోదా సహ-వ్యవస్థాపకుడు నితిన్‌ కామత్‌కు వాటాలున్నాయి.

యూపీఎస్సీకి (UPSC) సన్నద్ధమై చివరకు నిరాశ ఎదురైన వారికోసం ప్రత్యేక నియామక ప్రక్రియను రూపొందించినట్లు డిట్టో ఇన్సూరెన్స్‌ సహ-వ్యవస్థాపకుడు భాను హరీశ్‌ గుర్రం తెలిపారు. ‘‘ఏటా లక్షల మంది యూపీఎస్సీకి సిద్ధమవుతారు. కానీ, సుమారు 800 మందికి మాత్రమే అవకాశం లభిస్తుంది. దాదాపు 99 శాతం మంది విఫలమవుతారు. ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో 3-4 ఏళ్ల పాటు ప్రయత్నించినవారు నాకు తెలుసు. కేవలం యూపీఎస్సీనే కాదు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు, బ్యాంక్‌ పీఓలు, గేట్‌ విషయంలోనూ ఇంతే. వాళ్లు ఎంత కృషి చేస్తారో మాకు తెలుసు. అందుకే మాజీ యూపీఎస్సీ అభ్యర్థుల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. ఎలాంటి అనుభవం లేకున్నా ఉద్యోగమిస్తాం’’ అని హరీశ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని