Vaccine: తొలిసారి.. డ్రోన్‌ ద్వారా కరోనా టీకాల డెలివరీ

దేశంలోనే తొలిసారి డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతానికి కరోనా టీకా డోసులను డెలివరీ చేశారు. రహదారి మార్గం సరిగా లేని కొండల ప్రాంతాలకు వ్యాక్సిన్లను సరఫరా

Updated : 18 Dec 2021 12:19 IST

పాల్ఘర్‌: దేశంలోనే తొలిసారి డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతానికి కరోనా టీకా డోసులను డెలివరీ చేశారు. రహదారి మార్గం సరిగా లేని కొండ ప్రాంతాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకు డ్రోన్లను ఉపయోగించాలని మహారాష్ట్ర యంత్రాంగం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా గత గురువారం పాల్ఘర్‌ జిల్లాలోని జాప్‌ గ్రామానికి డ్రోన్‌ ద్వారా వ్యాక్సిన్‌ డోసులను పంపించింది. 

ముంబయికి చెందిన స్టార్టప్‌ కంపెనీ బ్లూ ఇన్ఫినిటీ సాయంతో జవహర్‌ ప్రాంతం నుంచి 300 డోసులను జాప్‌లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి పంపినట్లు పాల్ఘర్‌ కలెక్టర్‌ డా. మాణిక్‌ గుర్సాల్ వెల్లడించారు. కేవలం 10 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే వ్యాక్సిన్‌ డోసులను విజయవంతంగా అక్కడకు పంపించగలిగామని తెలిపారు. బహుశా డ్రోన్ల ద్వారా టీకాల డెలివరీ దేశంలో ఇదే తొలిసారి అయి ఉంటుందని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మహారాష్ట్ర ఇన్నోవేషన్‌ సొసైటీ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. 

వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు రాలేని మారుమూల గ్రామ ప్రజలకు తమ ఇళ్ల వద్దే టీకాలు అందించేందుకు ఈ ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందని జిల్లా ఆరోగ్య అధికారి డా. దయానంద్‌ సూర్యవంశి తెలిపారు. అంతేగాక, మారుమూల ప్రజల్లో టీకాలపై ఉన్న సందేహాలను కూడా తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు వీలవుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని