Diamond: రైతుకు దొరికిన వజ్రం.. వేలం వేస్తే ఎంత వస్తుందో తెలుసా?

వజ్రాలకు పేరుగాంచిన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో అదృష్టం మరో రైతును వరిచింది. భూమినే నమ్ముకొని బతుకుతున్న.....

Updated : 05 May 2022 07:04 IST

పన్నా: వజ్రాలకు పేరుగాంచిన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో అదృష్టం మరో రైతును వరిచింది. భూమినే నమ్ముకొని బతుకుతున్న ఓ చిన్న రైతు లీజుకు తీసుకున్న గనిలో వజ్రం దొరికింది. ప్రతాప్‌సింగ్‌ యాదవ్‌ అనే రైతు తన గనిలో మూడు నెలలుగా ఎంతో శ్రమించి పనిచేయగా.. 11.88 క్యారెట్ల వజ్రం దొరికినట్టు వజ్రాల కార్యాలయం అధికారి రవి పటేల్‌ వెల్లడించారు. ఇది ఎంతో నాణ్యతతో కూడుకున్నదనీ.. త్వరలో జరగబోయే వేలంలో అమ్మకానికి ఉంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధర నిర్ణయించనున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా రైతు యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను చాలా పేద రైతును. కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది. కూలీగానూ పనిచేస్తున్నా. గత మూడు నెలలుగా ఈ గనిలో ఎంతో శ్రమించాను. నాకు దొరికిన డైమండ్‌ను వజ్రాల కార్యాలయంలో అప్పగించాను’’ అన్నారు. డైమండ్‌కు వేలంలో తనకు వచ్చిన డబ్బుతో ఏదైనా ఓ వ్యాపారం పెట్టుకుంటాననీ.. తన పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని ఆ రైతు చెప్పుకొచ్చాడు. ఎంతో నాణ్యతతో కూడినది కావడంతో ఈ డైమండ్‌ ధర సుమారు రూ.50లక్షల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఈ ముడి వజ్రాన్ని వేలం వేసి ప్రభుత్వ రాయల్టీ, పన్నులను మినహాయించుకోగా వచ్చిన మొత్తాన్ని రైతుకు అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని