Harsh Vardhan: పార్లమెంట్‌ సభ్యులు కూర్చోడానికి సీట్లు కేటాయించరా?

దిల్లీ నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా ప్రమాణస్వీకారోత్సవంలో ఒకింత గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రముఖులకు సీట్ల కేటాయింపు ఏర్పాట్లపై అసంతృప్తికి గురైన భాజపా ఎంపీ, కేంద్ర మాజీ

Published : 26 May 2022 20:19 IST

దిల్లీ ఎల్జీ ప్రమాణస్వీకారంలో కేంద్ర మాజీ మంత్రి అసహనం

దిల్లీ: దిల్లీ నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా ప్రమాణస్వీకారోత్సవంలో ఒకింత గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రముఖులకు సీట్ల కేటాయింపు ఏర్పాట్లపై అసంతృప్తికి గురైన భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్‌ కార్యక్రమం నుంచి కోపంగా వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దిల్లీలోని రాజ్‌ నివాస్‌లో సక్సేనా నేడు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన హర్షవర్ధన్‌ అర్ధాంతరంగా సభ నుంచి వెళ్లిపోయారు. వేదిక నుంచి కోపంగా బయటకు వస్తున్న ఆయనను అక్కడున్న సిబ్బంది ఏమైందని అడిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి.. ‘‘కనీసం పార్లమెంట్‌ సభ్యులకు కూడా వాళ్లు సీట్లు కేటాయించలేదు. ఈ ఏర్పాట్లపై నేను సక్సేనాజీకి లేఖ రాస్తాను’’ అని చెప్పుకుంటూ వెళ్లిపోయారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాంగ్రెస్‌ సోషల్‌మీడియా ఇన్‌ఛార్జ్‌ రోహన్‌ గుప్తా ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ భాజపాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భాజపాలో మాజీ మంత్రులు, సీనియర్‌ నేతల పరిస్థితి ఇది అంటూ దుయ్యబట్టారు. సక్సేనా ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన భాజపా ఎంపీలు మనోజ్‌ తివారీ, పర్వేశ్‌ వర్మ కూడా వెనుక వరుసల్లో కూర్చుని కన్పించడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. దీనిపై సక్సేనాను మీడియా ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

హర్షవర్ధన్‌ గతంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా వ్యవహరించారు. కరోనా మహమ్మారి సమయంలో ఆయనపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్‌ విస్తరణ సమయంలో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో మన్‌సుఖ్‌ మాండవీయకు ఆరోగ్యశాఖ బాధ్యతలు అప్పగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని