
Statue of liberty: అమెరికాకు చేరనున్న‘లిటిల్ సిస్టర్’
(Photo: nps.gov)
వాషింగ్టన్: స్నేహబంధానికి గుర్తుగా అమెరికాకు ఫ్రాన్స్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని బహుకరించిన విషయం తెలిసిందే. 1886లో ఫ్రాన్స్ బహుకరించిన 46 మీటర్లు(151అడుగుల 1 అంగుళం) ఎత్తున్న ఈ విగ్రహం న్యూయార్క్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం. అయితే, తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం అమెరికాకు మరోసారి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని బహుమతిగా ఇవ్వనుంది. ఇప్పటికే ఆ బహుమతిని ఫ్రాన్స్ పంపించగా.. అది వచ్చే నెలలో అమెరికాను చేరుకోనుంది.
135 ఏళ్ల కిందట అమెరికాకు బహుకరించిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి విగ్రహన్నే ఫ్రాన్స్ గతంలో పది అడుగుల ఎత్తుతో కాంస్యంతో తయారు చేయించి పారిస్‌లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌లో ఏర్పాటు చేసింది. ఇది న్యూయార్క్‌లో ఉన్న అసలైన విగ్రహంలో 1/16 వంతు ఉంటుంది. దీనికి లిటిల్ సిస్టర్ అని నామకరణం చేశారు. ఇప్పుడు ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని అమెరికాతో స్నేహం ఎప్పటికీ నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఆ దేశానికి బహుమతిగా ఇచ్చారు.
అయితే, ఈ లిటిల్ సిస్టర్ విగ్రహాన్ని మొదట న్యూయార్క్‌లోని లిబర్టీ ఐలాండ్ సమీపంలో ఉన్న ఎల్లిస్ ఐలాండ్‌లో ఏర్పాటు చేయనున్నారు. జులై 1 నుంచి జులై 5వ తేది వరకు అక్కడ సందర్శనకు ఉంచి.. ఆ తర్వాత వాషింగ్టన్ డీసీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయబోతున్నారట. అక్కడ ఈ విగ్రహం పదేళ్ల పాటు ఉండనుందని ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. ‘‘అమెరికాకు మేము (ఫ్రాన్స్) చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. అమెరికాతో స్నేహం మాకు ఎంతో ముఖ్యం. ఈ స్నేహాన్ని ఇలాగే కొనసాగించాలి’’అని ఫ్రాన్స్ నేషనల్ మ్యూజియం జనరల్ అడ్మినిస్ట్రేటర్ ఒలివర్ ఫారొన్ వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.