Delhi: దిల్లీలో విద్యుత్‌ సబ్సిడీ ఇక అందరికీ కాదు.. కేజ్రీవాల్‌ కీలక ప్రకటన

దేశ రాజధాని దిల్లీలో విద్యుత్‌ సబ్సిడీపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అందరికీ కాదని, కేవలం కోరుకున్నవారికి

Published : 05 May 2022 17:17 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో విద్యుత్‌ సబ్సిడీపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అందరికీ కాదని, కేవలం కోరుకున్నవారికి మాత్రమే ఇస్తామని వెల్లడించారు. ఈ కొత్త నిబంధన అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు.

‘‘ఇకపై దిల్లీలో చౌక విద్యుత్‌ ఆప్షనల్‌ కానుంది. అంటే.. విద్యుత్‌ వినియోగదారులు సబ్సిడీ కావాలని కోరుకుంటే అప్పుడు ఉచిత లేదా రాయితీ విద్యుత్‌ను అందిస్తాం. సబ్సిడీ కావాలా వద్దా అనే దానిపై ప్రజల నుంచి అధికారులు వివరాలను తీసుకుంటారు. విద్యుత్‌ ధరలు చెల్లించే సామర్థ్యం ఉన్నవారు.. తమకు సబ్సిడీ వద్దని, సాధారణ బిల్లులను చెల్లిస్తామని ప్రభుత్వాన్ని చెప్పొచ్చు. త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. అక్టోబరు 1 నుంచి ఎంపిక చేసుకున్నవారికి మాత్రమే విద్యుత్‌పై రాయితీ అందుతుంది’’ అని కేజ్రీవాల్‌ వివరించారు.

ప్రస్తుతం దిల్లీ వాసులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను కేజ్రీవాల్‌ సర్కారు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఆపైన, 201 నుంచి 400 యూనిట్ల వినియోగానికి నెలకు రూ.800 చొప్పున సబ్సిడీ ఇస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రాయితీని ఆప్షన్‌గా ఇవ్వాలని ఆప్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని