Atiq Ahmed: సాక్షి హత్య కేసులో అతిక్‌ అహ్మద్‌ లాయర్‌ అరెస్ట్‌..!

ప్రయాగ్‌రాజ్‌ మాజీ ఎంపీ, డాన్‌ అతీక్‌ అహ్మద్‌ లాయర్‌ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఓ హత్యకేసులో సాక్షి ఉమేశ్‌పాల్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని అతడే హంతకులకు చేరవేసినట్లు తేలింది.

Published : 30 Jul 2023 11:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉమేశ్‌ పాల్‌ హత్య కేసులో పోలీసులు అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmed) లాయర్‌ విజయ్‌ మిశ్రాను అరెస్టు చేశారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్‌ హత్య కేసులో ఉమేశ్‌ ప్రధాన సాక్షి. అతడిపై అతీక్‌ అహ్మద్‌ కుమారుడు, మరికొందరు వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు ఉత్తరప్రదేశ్‌ను కుదిపేశాయి. వాస్తవానికి హత్యకు ముందు ఉమేశ్‌పాల్‌ లొకేషన్‌ను లాయర్‌ విజయ్‌నే హంతకులకు చేరవేసినట్లు తేలింది. దీంతో పోలీసులు నిన్న లఖ్‌నవులోని ‘హోటల్‌ హయత్‌ లెగస్సీ’పై దాడి చేసి అతడిని అరెస్టు చేశారు.

ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. వంద మంది పేషంట్ల తరలింపు

నాడు విజయ్‌ నుంచి సమాచారం అందుకొన్న హంతకులు ఉమేశ్‌ ఇంటి వద్దే దాడి చేసి హత్య చేశారు. ఈ హత్యపై అప్పట్లో యూపీ అసెంబ్లీలో పెను దుమారం రేగింది. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో మాఫియాను నాశనం చేస్తామని ప్రకటించారు. నిందితుల ఇళ్లను బుల్‌డోజర్లు కూల్చివేశాయి. అనంతరం అతీక్‌ అహ్మద్‌, మరో నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. కుమారుడి అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటల్లోనే అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడిని ముగ్గురు యువకులు పోలీసుల సమక్షంలోనే కాల్చిచంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ప్రస్తుతం అతీక్‌ భార్య పర్వీన్‌ కూడా ఈకేసులో నిందితురాలుగా ఉంది. ఆమె పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి 2019లో అతీక్‌ను గుజరాత్‌లో సబర్మతి జైలుకు తరలించారు. మరోవైపు ఆమె కుమారులు అలీ అహ్మద్‌, ఉమర్‌ అహ్మద్‌, మరిది అష్రాఫ్‌లు కూడా జైళ్లలోనే ఉన్నారు. దీంతో పర్వీన్‌ రంగంలోకి దిగి భర్త తరఫున పనులను చక్కబెట్టడం మొదలుపెట్టింది. ఆమె సబర్మతి జైలులో తనను కలుసుకొన్నప్పుడే ఉమేశ్‌పాల్‌ హత్యకు కుట్రపన్నినట్లు అతీక్‌ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతోపాటు ఆమె అతీక్‌కు ఫోన్‌, సిమ్‌ను చేరవేసింది. ఆ ఫోన్‌తోనే  ఉమేశ్‌ హంతకులతో అతీక్‌ టచ్‌లో ఉన్నట్లు తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని