విద్యార్థులపై పడిన విమాన ఇంధనం

ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా గాల్లో ఉన్న విమానాన్ని కిందకు దించేందుకు ఇంధనాన్ని విడుదల చేయడంతో పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయిన ఘటన అమెరికాలోని...

Updated : 12 Sep 2023 17:17 IST

లాస్‌ ఏంజిల్స్‌: ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా గాల్లో ఉన్న విమానాన్ని కిందకు దించేందుకు ఇంధనాన్ని విడుదల చేయడంతో పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయిన ఘటన అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో మంగళవారంనాడు చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్‌లైన్స్‌ కు చెందిన ఫ్లయిట్ 89 విమానం లాస్‌ఏంజెల్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చైనాలోని షాంఘైకి బయలుదేరింది. అయితే గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా దింపేందుకు అందులోని కొంత ఇంధనాన్ని గాల్లో ఉండగానే కిందకు విడుదల చేశారు. ఆ ఇంధనం పార్క్ అవెన్యూ పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటున్న విద్యార్థులపై పడింది. దీంతో 17మంది విద్యార్థులు వారితో పాటు ఉన్న 9మంది సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. దీని గురించి లాస్‌ ఏంజెల్స్‌ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక అధికారులు తెలపారు. ఈ ఘటనపై డెల్టా విమానయాన సంస్థ ప్రకటన విడుదల చేసింది. లాస్‌ ఏంజెల్స్‌ నుంచి షాంఘైకి ప్రయాణిస్తున్న ఫ్లయిట్ 89 ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని అత్యవసరంగా కిందకు దింపినట్లు తెలిపింది. అంతకుముందు విమానంలో ఉన్న బరువుని తగ్గించేందుకు కొంత ఇంధనాన్ని కిందకు విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ వర్గాలు విచారణకు ఆదేశించాయి.

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని