సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అనవసరం: బంగ్లా ప్రధాని

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) భారత అంతర్గత విషయాలని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. అదే సమయంలో సీఏఏ అనవసరమని

Published : 19 Jan 2020 19:06 IST

దుబాయ్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) భారత అంతర్గత విషయాలని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. అదే సమయంలో సీఏఏ అనవసరమని అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం ఎందుకు దీన్ని తీసుకొచ్చిందో తమకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. దుబాయ్‌లో ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.  సీఏఏ, ఎన్‌ఆర్‌సీ భారత అంతర్గత విషయాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. తాను 2019 అక్టోబర్‌లో దిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీ సైతం ఇదే విషయమై తనకు భరోసా ఇచ్చారని హసీనా తెలిపారు. భారత్‌-బంగ్లాదేశ్‌ సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ఏకే అబ్ధుల్‌ మెమెన్‌ సైతం సీఏఏ, ఎన్‌ఆర్‌సీ విషయంలో అంతకుముందు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. భారత్‌లో దీనిపై జరుగుతున్న నిరసనల ప్రభావం పొరుగు దేశాలపై పడుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు మతపరమైన పీడన కారణంగా బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు ఎవరూ వలస పోలేదని ఆ దేశం స్పష్టంచేసింది. మతపరమైన పీడన కారణంగా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి  భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో సీఏఏని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతుండగా.. కొన్ని రాష్ట్రాలు తాము ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని