
నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా
దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య ఘటనలో దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు పటియలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి ఆదేశాల ఇచ్చే వరకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలని ఆదేశించింది.
గతంలో దిల్లీ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం శనివారం (ఫిబ్రవరి 1న) ఉదయం ఆరు గంటలకు నలుగురు దోషులకు ఉరితీయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో మరో దోషి వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. ఈ అభ్యర్థన ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. న్యాయపరంగా అన్ని అవకాశాలూ ఉన్న నేపథ్యంలో ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ గురువారం పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా డెత్ వారెంట్‌పై స్టే విధిస్తూ శిక్ష అమలును వాయిదా వేస్తూ తీర్పు వెలువరించారు. రాష్ట్రపతి వద్ద వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలుపై స్టే విధించారు. ఒకే కేసులో ఒకే శిక్ష పడిన దోషుల్లో ఏ ఒక్కరికి శిక్ష అమలు వాయిదా పడినా మిగిలిన వారికి అది వర్తిస్తుందని తీర్పులో పేర్కొన్నారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టు మరోసారి డెత్ వారెంట్ ఇవ్వనుంది.
డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వడం ఇది రెండోసారి. వాస్తవానికి జనవరి 22నే నిర్భయ దోషులకు ఉరితీయాల్సి ఉండగా తొలిసారి స్టే విధించారు. దీంతో ఫిబ్రవరి 1న ఉరితీయాలని డెత్ వారెంట్ జారీ చేయగా తాజా రెండోసారి స్టే విధించడం గమనార్హం. మరోవైపు నిర్భయ కేసు విచారణ సమయంలో తాను మైనర్‌నంటూ పిటిషన్ వేసిన దోషి పవన్ గుప్తా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను ఇవాళ కొట్టివేసింది.