ఎంఎస్‌ఎంఈలకు రూ.3లక్షల కోట్ల రుణాలు

కరోనా సంక్షోభంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. కరోనా సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు

Updated : 13 May 2020 19:16 IST

దిల్లీ: కరోనా సంక్షోభంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కరోనా సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఆమె వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘సూక్ష్మ, మధ్య, లఘు, కుటీర పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)కు రూ.3లక్షల కోట్లు ఎలాంటిపూచీకత్తు లేకుండా రుణాలిస్తాం. 12 నెలల మారటోరియంతో ఈ రుణాలు మంజూరుచేస్తాం. ఎంఎస్‌ఎంఈలకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం కలుగుతుంది. ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను ఇవాళ్టి నుంచి ఒక్కొక్కటిగా వివరాలను ప్రకటిస్తాం. రూ.5లక్షల లోపు ఆదాయ పన్ను రీఫండ్‌ బ‌కాయిలు వెనక్కి చెల్లించాం. భారత్‌ స్వయం శక్తితో ఎదగాలనేదే మా లక్ష్యం’’ అని అన్నారు.

ఉద్యోగుల భద్రతకు తోడ్పాటు
‘‘ఈ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు చేస్తాం. ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం రూ.10వేల కోట్లతో ఫండ్‌ ఏర్పాటు. ఎంఎస్‌ఎంఈలకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం చేకూరనుంది. ఎంఎస్‌ఎంఈలు తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు ఇది దోహదపడుతుంది. ఉద్యోగుల భద్రత కల్పించేందుకు ఉపయోగపడుతుంది. అన్ని విభాగాల్లోనూ నగదు లభ్యతే ప్రధాన సమస్యగా ఉంది. తీవ్రమైన రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.20వేల కోట్లు; ఎంఎస్‌ఎంఈల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.50వేల కోట్లు కేటాయింపు. ఈ ప్యాకేజీతో రెండు లక్షల చిన్న తరహా పరిశ్రమలకు ప్రయోజనం కలగనుంది. ఎంఎస్‌ఎంఈల నిర్వచనంపై కొంత అయోమయం ఉంది. ఇప్పుడు మేలు చేసేలా కొత్త నిర్వచనం ఇస్తున్నాం’’ అని నిర్మల పేర్కొన్నారు. 

నవభారత్ నిర్మాణమే మూల సూత్రంగా.. 

‘‘ప్రధాని ఒక సమగ్రమైన దార్శినికతను దేశం ముందుంచారు. దేశ ఆర్థిక వృద్ధిని పెంచి స్వయం సమృద్ధి భారతే లక్ష్యంగా ఈ ప్యాకేజీ ప్రకటించారు. ఆర్థిక, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, జనాభా, డిమాండ్‌ అనే ఐదు మూల సూత్రాలుగా ఈ ప్యాకేజీ ఉంటుంది. స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యం. గత 40 రోజుల్లో మన శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసింది. పీపీఈ కిట్లు, మాస్క్‌ల తయారీలో ఎంతో ప్రగతి సాధించాం. నవ భారత్‌ నిర్మాణమే ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ మూల సూత్రం’’ అని తెలిపారు.    

ఆత్మ నిర్భర్‌ భారత్‌తో ప్రజలకు కొత్త ఉత్తేజం
‘‘గడిచిన ఐదేళ్లలో ఎన్నో విధాలుగా సంస్కరణల్ని అమలు చేశాం.  ప్రత్యక్ష నగదు బదిలీ మా సంస్కరణలకు మేలిమి ఉదాహరణ. భూమి, నగదు లభ్యత, పాలనాపరమైన విధానాలే కీలకం. డీబీబీ, సూక్ష్మస్థాయి బీమాలతో ప్రజలకు ఎతో మేలు జరుగుతుంది. స్వచ్ఛభారత్ అభియాన్‌, ఆయుష్మాన్‌ భారత్‌ మేం చేపట్టిన కీలక పథకాలు. ఎఫ్‌ఢీఐ నిబంధనలకు సరళీకరించి పెట్టుబడులకు మార్గం సుగమమం చేశాం. తాజాగా ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ నినాదం దేశ ప్రజలకు కొత్త ఉత్తేజం ఇస్తుంది. కరోనా కష్టాల నుంచి పేదలకు ఉపశమనం కోసం గరీబ్‌ కల్యాణ్‌ యోజన అమలు చేస్తున్నాం’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని