‘గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి’

ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. లాక్‌డౌన్‌, షట్‌డౌన్‌లు సైతం వైరస్‌ కట్టడిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవున్నాయి.........

Published : 06 Jul 2020 11:45 IST

ఆధారాలు ఉన్నాయంటున్న 239 మంది శాస్త్రవేత్తల బృందం

డబ్ల్యూహెచ్‌వోకు లేఖ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. లాక్‌డౌన్‌, షట్‌డౌన్‌లు సైతం వైరస్‌ కట్టడిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవున్నాయి. అమెరికా వంటి దేశాల్లో తగ్గుముఖం పట్టినట్టే పట్టి మరోసారి తీవ్రరూపం దాలుస్తోంది. సామాజిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వినియోగం వంటి నియమాల్ని పాటిస్తున్నప్పటికీ.. వైరస్‌ తీవ్రత ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తికి సంబంధించి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గాలి ద్వారా ఇది వ్యాపిస్తోందనే వాదన కొన్ని వర్గాల నుంచి కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ వాదనను బలపరుస్తూ ఓ శాస్త్రవేత్తల బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)కు లేఖ రాసింది.  ఈ మేరకు అమెరికా పత్రిక ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది.  

గాలిలో ఉండే చిన్న చిన్న కణాల ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందనడానికి ఆధారాలున్నాయని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి సంబంధించిన సూచనలు, సిఫార్సులను సవరించాలని డబ్ల్యూహెచ్‌వోకు సూచించింది. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని ఆధారాలతో సహా వచ్చే వారం ఓ ప్రముఖ జర్నల్‌లో ప్రచురించనున్నట్లు 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. కరోనా బాధితులు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వెలువడే తుంపర్లు గాలిలోని చిన్న కణాల్లోకి ప్రవేశించి ఒక గది వంటి నిర్దేశిత ప్రాంతంలో తిరుగుతూ వైరస్‌ను వ్యాప్తి చేస్తాయని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఇందుకు భిన్నంగా డబ్ల్యూహెచ్‌వో మాత్రం కేవలం బాధితుల తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని చెబుతున్న విషయం తెలిసిందే. 

ఈ కథనంపై డబ్ల్యూహెచ్‌వో ఇంకా స్పందించాల్సి ఉంది.  గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందనడానికి బలమైన ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌వో ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జూన్‌ 29న విడుదల చేసిన మార్గదర్శకాల్లోనూ ఇదే విషయాన్ని పునరావృతం చేసింది. వైద్య ప్రక్రియల అనంతరం వెలువడే ఐదు మైక్రాన్ల(ఒక మైక్రాన్ అంటే మీటర్‌లో పదిలక్షలో వంతు ) కంటే చిన్న కణాల ద్వారా మాత్రమే వైరస్‌ వ్యాపించే అవకాశం ఉందని తెలిపింది. ఇది చాలా అరుదుగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గాలి ద్వారా వైరస్ వ్యాపించదని పరోక్షంగా చెప్పింది. 

ఒకవేళ గాలి ద్వారా వైరస్‌ వ్యాపించే ఆస్కారముందన్న శాస్త్రవేత్తల వాదనే నిజమైతే.. మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కార్యాలయాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు సహా గాలి, వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో కట్టడి సవాల్‌గా పరిణమించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాల వంటి ప్రాంతాల్లో గాలి అక్కడే చక్కర్లు కొట్టకుండా బలమైన ఫిల్టర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం రావొచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని