చైనా బెదిరింపులను గమనిస్తున్నాం

భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై బైడెన్‌ సర్కారు తొలిసారి స్పందించింది. పొరుగు దేశాలను డ్రాగన్‌ బెదిరిస్తున్న తీరును నిశితంగా గమనిస్తున్నామని, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ స్నేహితులు..

Updated : 29 Feb 2024 17:28 IST

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మిత్రులతో కలిసి ముందుకెళ్తాం   
తొలిసారి స్పందించిన బైడెన్‌ ప్రభుత్వం

వాషింగ్టన్‌: భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై బైడెన్‌ సర్కారు తొలిసారి స్పందించింది. పొరుగు దేశాలను డ్రాగన్‌ బెదిరిస్తున్న తీరును నిశితంగా గమనిస్తున్నామని, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ స్నేహితులు, భాగస్వాములతో కలిసి ముందుకెళ్తామని పేర్కొంది. ట్రంప్‌ హయాంలో అమెరికా-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. డ్రాగన్‌ను అడుగడుగునా నిలువరించేందుకు మాజీ అధ్యక్షుడు తీవ్రంగా ప్రయత్నించారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి తర్వాత అమెరికాతో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో- బైడెన్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న శ్వేతసౌధ జాతీయ భద్రతా మండలి (ఎన్‌ఎస్‌సీ) అధికార ప్రతినిధి ఎమిలీ హార్నె మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్‌-చైనా మధ్య నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. సరిహద్దు వివాదాలను ఉభయ దేశాలు చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు సహకారాన్ని కొనసాగిస్తాం. పొరుగు దేశాలను చైనా బెదిరిస్తున్న తీరును గమనిస్తున్నాం. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శ్రేయస్సును, భద్రతను పెంపొందించేందుకు మిత్రులు, భాగస్వాములతో కలిసి ముందుకెళ్తాం’’ అని ఆమె పేర్కొన్నారు.  

చైనా ప్రయత్నాలపై అమెరికా కన్ను
ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుత ప్రాంతంగా ప్రకటించేందుకు భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన ‘క్వాడ్‌’ ప్రయత్నిస్తోంది. చైనా మాత్రం ఇక్కడ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సైన్యాన్ని ఉపయోగించుకుంటోంది. యావత్‌ దక్షిణ చైనా జలాలు తమవేనని, ఆ సముద్రభాగంపై పూర్తి సార్వభౌమాధికారం తమకే ఉందని డ్రాగన్‌ వాదిస్తోంది. వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రూనై, తైవాన్‌లు మాత్రం దీన్ని  వ్యతిరేకిస్తున్నాయి. తూర్పు చైనా సముద్రంపైనా జపాన్‌-చైనాల మధ్య ఇలాంటి వివాదమే నెలకొంది. ఈ రెండు సముద్రాల్లో ఖరీదైన ఖనిజ సంపదతో పాటు చమురు, సహజవాయు నిక్షేపాలు అపారంగా ఉండటంతో వీటిపై ఆధిపత్యం కోసం ఆయా దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ విషయంలో చైనా వ్యవహరిస్తున్న తీరును అమెరికా తదితర శక్తిమంతమైన దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.

వలస వ్యవస్థ సంస్కరణకు అడుగులు
వలస వ్యవస్థకు సంబంధించి మూడు కీలక ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతకాలు చేయనున్నారు. వలసలకు సంబంధించి ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడం... సరళమైన, సమర్థవంతమైన చట్టబద్ధ వలస విధానాన్ని  తీసుకురావడం... విదేశాల నుంచి వచ్చినవారికి తమ కుటుంబాలతో కలిసి నివసించే అవకాశాన్ని కల్పించడం వంటి నిర్ణయాలకు సంబంధించి ఈ ఆదేశాలు ఉంటాయని శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. 

ఇవీ చదవండి..

కరోనా నకిలీ వ్యాక్సిన్ల సరఫరా..80 మంది అరెస్టు

నావల్నీకి జైలు శిక్ష.. భగ్గుమన్న రష్యా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని