Aryan khan drugs case: డ్రగ్స్‌ కేసులో సిట్‌ దర్యాప్తు ప్రారంభం

షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కేసుతో పాటు మరో ఐదు డ్రగ్స్‌ కేసులపై 

Published : 07 Nov 2021 12:06 IST

ముంబయి: షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కేసుతో పాటు మరో ఐదు డ్రగ్స్‌ కేసులపై శుక్రవారం ఏర్పాటైన మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వెంటనే పని ప్రారంభించింది. శనివారమే దిల్లీ నుంచి ముంబయి చేరుకుని, ఈ కేసులకు సంబంధించిన పత్రాలన్నింటికీ ముంబయిలోని ఎన్‌సీబీ జోనల్‌ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకుంది. ఆయా కేసుల దర్యాప్తు ఎంతవరకు జరిగిందో తొలుత పరిశీలిస్తామని, ఆ తర్వాతే పునర్విచారణపై నిర్ణయం తీసుకుంటామని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఈ ఆరు కేసుల దర్యాప్తు నుంచి తొలగింపునకు గురైన ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే మాత్రం.. దర్యాప్తులో తాను లేనప్పటికీ జోనల్‌ డైరెక్టర్‌ హోదాలో పర్యవేక్షక అధికారిగా కొనసాగుతానని చెప్పారు. సిట్‌ దర్యాప్తుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ స్పందిస్తూ.. ఆర్యన్‌ను కేసులో ఇరికించడమే కాక, అతన్ని విడుదల చేసేందుకు లంచం డిమాండ్‌ చేసిన సమీర్‌ వాంఖడేపైనా విచారణ జరగాలన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సిట్‌ వేసిందని, వాంఖడే ప్రైవేటు ముఠా గుట్టును ఎవరు బయటపెడతారో ఎదురుచూస్తున్నామని చెప్పారు.

ఎన్‌సీపీ నేతల సన్నిహితుడే సూత్రధారి: భాజపా

ఆర్యన్‌ ఖాన్‌ సహా ఇతర డ్రగ్స్‌ కేసుల వ్యవహారంలో ధులేకు చెందిన సునిల్‌ పాటిల్‌ అసలు సూత్రధారి అని భాజపా నేత మోహిత్‌ భారతీయ ఆరోపించారు. ఇతను అనిల్‌ దేశ్‌ముఖ్‌ సహా చాలామంది ఎన్‌సీపీ నాయకులకు సన్నిహితుడని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో హోం మంత్రిగా ఉన్న అనిల్‌ దేశ్‌ముఖ్‌.. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు చింకూ పఠాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అతిథిగృహంలో కలిశారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను మంత్రి నవాబ్‌ మాలిక్‌ కొట్టిపారేశారు. నిజాలేమిటో ఆదివారం మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు.

అనిల్‌ దేశ్‌ముఖ్‌కు జ్యుడీషియల్‌ కస్టడీ

మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ముంబయిలోని ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఆయన్ను విచారించేందుకు మరో 9 రోజుల రిమాండ్‌ కావాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్ల లంచం వసూలు చేసి ఇవ్వాలంటూ అనిల్‌ దేశ్‌ముఖ్‌ పోలీసులను ఒత్తిడి చేస్తున్నారని ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించారు. దీనిపై నమోదైన సీబీఐ కేసు ఆధారంగా ఈడీ గత సోమవారం అనిల్‌ దేశ్‌ముఖ్‌తో పాటు అతని అనుచరులు కుందన్‌ షిండే, సంజీవ్‌ పలాండేలను అరెస్టు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని