Covid: దీర్ఘకాల కొవిడ్‌ బాధితుల్లో నెలల తర్వాతా అనారోగ్య సమస్యలు

కరోనాతో దీర్ఘకాలం బాధపడిన చాలామందిని నెలల తర్వాత కూడా విపరీతమైన అలసటతో కూడిన క్రానిక్‌ ఫెటీగ్‌ సిండ్రోమ్‌..

Published : 01 Dec 2021 11:36 IST

వాషింగ్టన్‌: కరోనాతో దీర్ఘకాలం బాధపడిన చాలామందిని నెలల తర్వాత కూడా విపరీతమైన అలసటతో కూడిన క్రానిక్‌ ఫెటీగ్‌ సిండ్రోమ్‌ (సీఎఫ్‌సీ), శ్వాస సంబంధ సమస్యలు వెంటాడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా వైరస్‌ల కారణంగా ఇన్‌ఫెక్షన్‌ సోకిన తర్వాత సీఎఫ్‌సీ దరిచేరుతుంది. తీవ్ర అలసట, కుంగుబాటు వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే కొవిడ్‌ దీర్ఘకాల బాధితుల్లో పోస్ట్‌-అక్యూట్‌ సీక్వెల్‌ ఆఫ్‌ సార్స్‌-కొవ్‌-2 (పీఏఎస్‌సీ) కనిపిస్తోందని, ఇంట్లోనే ఉండి స్వస్థత పొందినవారిలోనూ ఇది తలెత్తుతోందని మౌంట్‌ సీనాయ్‌ ఆసుపత్రి పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా తీవ్ర అలసట, దేనిపైనా ఏకాగ్రత కుదరకపోవడం, గ్రహణశక్తి మందగించడం, నిద్రలేమి, ఒళ్లు, కండరాల నొప్పులు, శ్వాస సరిగా ఆడకపోవడం వంటి సమస్యలు ఉంటున్నట్టు గుర్తించారు.

23-69 సంవత్సరాల వయసున్న మొత్తం 41 మంది కొవిడ్‌ దీర్ఘకాల బాధితుల ఆరోగ్య పరిస్థితిని వారు విశ్లేషించారు. పల్మనరీ, కార్డియాలజీకి సంబంధించి సీపీఈటీ వంటి అనేక వైద్య పరీక్షలు కూడా చేపట్టారు. ‘‘2005లో సార్స్‌-కొవ్‌-1కు గురైన వారిలోనూ దాదాపు ఇలాంటి లక్షణాలే కనిపించాయి. వారిలో 27% మంది నాలుగేళ్ల వరకూ సీఎఫ్‌సీ సమస్యలతో బాధపడ్డారు. తీవ్రస్థాయి కొవిడ్‌ బాధితుల్లో అవయవాలకు నష్టం వాటిల్లుతున్నట్టు గుర్తించాం’’ అని పరిశోధనకర్త డా.డొన్నా మాన్సిని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని