Booster Dose:బూస్టర్‌ డోసుపై కాంగ్రెస్‌, భాజపావాగ్వాదం

కొవిడ్‌-19 టీకా కార్యక్రమం విషయమై కాంగ్రెస్‌ పార్టీ, కేంద్ర ప్రభుత్వాలు సోమవారం వాగ్వాదానికి దిగాయి. 

Published : 28 Dec 2021 10:39 IST

31 కల్లా అందరికీ తొలి డోసు అందదు: పి.చిదంబరం

 కాంగ్రెస్‌ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది: ధర్మేంద్ర ప్రధాన్

దిల్లీ: కొవిడ్‌-19 టీకా కార్యక్రమం విషయమై కాంగ్రెస్‌ పార్టీ, కేంద్ర ప్రభుత్వాలు సోమవారం వాగ్వాదానికి దిగాయి. బూస్టర్‌ డోసులపై గందరగోళం నెలకొందని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ హోం మంత్రి పి.చిదంబరం విమర్శించారు. మందకొడిగా సాగుతున్న టీకాల కార్యక్రమంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, డిసెంబరు 31 నాటికి దేశంలోని అర్హులు అందరికీ (100 శాతం మేర) తొలి డోసు అందించాలన్న లక్ష్యాన్ని చేరుకోలేమని పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వానికి ఇష్టం లేకున్నా.. వాస్తవాన్ని చూద్దాం. దేశంలో అర్హులైన 94 కోట్ల మంది పౌరులూ డిసెంబరు 31లోగా తొలి డోసు తీసుకోలేరు. మనం 100 శాతం లక్ష్యాన్ని సాధించలేం. చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు రెండో డోసు టీకాను సైతం పొందలేరు’’ అని చిదంబరం సోమవారం ఓ ట్వీట్‌ చేశారు. ‘‘గతంలో చేసిన పొరపాట్లకు మూల్యం చెల్లిస్తున్నాం. ఆలస్యమైన ఆర్డర్లకు, ఆలస్యమైన చెల్లింపులకు, ఫైజర్, మోడెర్నాలకు లైసెన్స్‌ ఇవ్వనందుకు, తక్కువ ఉత్పత్తి, సరఫరాలకు మనం మూల్యం చెల్లిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ‘‘కొవిషీల్డ్‌కు బూస్టర్‌ డోసు ఏది? కొవిషీల్డ్‌ మరో డోసు కాదని భావిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి, భాజపా నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ నాయకులు ప్రతిదీ వ్యతిరేకిస్తారని, సాధ్యం కాదని చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భయాందోళనలు, అసత్యాలు ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంటారని విమర్శించారు. భారత్‌ తీసుకునే ప్రగతీశీల చర్యలపై కాంగ్రెస్‌ పార్టీ శాడిజం వైఖరి ఎప్పుడూ ఆశ్చర్యం కలిగించదని వ్యాఖ్యానించారు. ‘‘తొలుత వారు దేశంలో తయారుచేసిన టీకాల సామర్థ్యంపై ప్రజలను తప్పుదోవ పట్టించారు. సందేహాలను పెంచారు. దేశ సమష్టి సామర్థ్యాన్ని అవమానిస్తూ భయాందోళనలను రేకెత్తించారు’’ అని విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని