Rajnath singh: అనిశ్చిత పరిస్థితుల్లో ఘర్షణ అనివార్యం: రాజ్‌నాథ్‌సింగ్‌

ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఘర్షణ ఏ రూపంలోనైనా ప్రారంభమయ్యే అవకాశం ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. సరిహద్దుల భద్రతకు ఎటువంటి సవాళ్లు ..

Published : 29 Dec 2021 09:24 IST

సవాళ్లు ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాల్సిందే
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టీకరణ

దిల్లీ: ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఘర్షణ ఏ రూపంలోనైనా ప్రారంభమయ్యే అవకాశం ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. సరిహద్దుల భద్రతకు ఎటువంటి సవాళ్లు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాల్సిందేనన్నారు. అటువంటి సన్నద్ధతకు ఉపయుక్తంగా ఉంటాయనే సరిహద్దుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడించారు.

సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్‌ఓ) నిర్మించిన 27 మౌలిక వసతుల ప్రాజెక్టులను రక్షణ మంత్రి మంగళవారం వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. దేశ ఉత్తర సరిహద్దుల్లో ఇటువంటి ప్రాజెక్టులు అందుబాటులోకి రాకుంటే శత్రువుల నుంచి ఎదురయ్యే ముప్పును గట్టిగా తిప్పికొట్టేందుకు మన సైన్యం సకాలంలో సన్నద్ధం కాలేదని వివరించారు. సరిహద్దుల్లో నిర్మించే రహదారులు, వంతెనలు, సొరంగమార్గాలు దేశ రక్షణలో ముఖ్య భూమికను వహిస్తాయని చెప్పారు. మౌలిక వ్యవస్థల నిర్మాణంతో పాటు నిఘా వ్యవస్థలనూ పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అత్యంత కీలకమైనది ఉమ్లింగ్‌ లా
రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ప్రారంభించిన 27 ప్రాజెక్టుల్లో మూడు రహదారులకు, 24 వంతెనలకు సంబంధించినవి. వంతెనల్లో జమ్మూకశ్మీర్‌-9, లద్దాఖ్‌-5, హిమాచల్‌ప్రదేశ్‌-5, ఉత్తరాఖండ్‌-3, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలలో ఒక్కోక్కటి చొప్పున ఉన్నాయి. రహదారుల ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైనది సముద్ర మట్టానికి 19వేల అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్‌ లా పాస్‌. 52 కి.మీ.పొడవైన ఈ మార్గం ద్వారా చిశుల్‌ నుంచి డెమ్‌చోక్‌కు చేరుకోవచ్చు. లేహ్‌ నుంచి వ్యూహాత్మక ప్రాంతమైన డెమ్‌చోక్‌కు వెళ్లేందుకు ఇది ప్రత్యామ్నాయ రహదారి. సైనిక దళాల తరలింపునకే కాకుండా పర్యాటకానికీ ఉపయోగపడుతుంది. ఈ మార్గంలోనే డొకలా వద్ద 11వేల అడుగుల ఎత్తులో నిర్మించిన 140 అడుగుల పొడవైన మాడ్యులర్‌ వంతెన ఉంది. ఈ తరహా మాడ్యులర్‌ వంతెనను దేశీయ పరిజ్ఞానంతో నిర్మించడం ఇదే ప్రథమం. దక్షిణ లద్దాఖ్‌లో నిర్మించిన ఈ రహదారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో వాహనాలు వెళ్లేందుకు అనువుగా నిర్మించిన మార్గమని రక్షణ మంత్రి తెలిపారు. సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితులను అధిగమిస్తూ బీఆర్‌ఓ ఈ రహదారిని నిర్మించి దేశానికి అందించడం ఎంతో గర్వించదగిన విషయమని పేర్కొన్నారు.

డోక్లాంకు ప్రత్యామ్నాయ రహదారి
చైనా సైన్యంతో 2017లో 73 రోజుల పాటు ప్రతిష్టంభన కొనసాగిన డోక్లాం ప్రాంతానికి ప్రత్యామ్నాయ రహదారి అందుబాటులోకి వచ్చింది. ఫ్లాగ్‌ హిల్‌ నుంచి డొక్లామ్‌ వెళ్లే ఈ రహదారి పొడవు 33 కి.మీ. దీనిద్వారా డోక్లాం ప్రాంతానికి మన సైన్యం త్వరగా చేరుకోవచ్చు. ఈ మార్గంలో భాగంగా మొత్తం 70 వంతెనలను నిర్మించారు. యుద్ద ట్యాంకులను తరలించేందుకు వీలుగా 70 టన్నులకు పైగా బరువును మోయగలిగే సామర్థ్యం వీటికి ఉంటుంది. భారత్‌-టిబెట్‌-భూటాన్‌ సరిహద్దులు కలిసే కూడలికి సమీపంగా వెళ్లేందుకు ఇది ప్రత్యామ్నాయ రహదారిగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు బీమ్‌ బేస్‌ నుంచి డొక్లామ్‌కు 2018లోని నిర్మించిన మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని