సంక్షిప్త వార్తలు(8)

నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ)లోని సెక్షన్‌ 482 కింద తమకు దఖలుపడిన స్వతస్సిద్ధ అధికారాలను హైకోర్టులు చాలా జాగ్రత్తగా, అప్రమత్తతతో ఉపయోగించాలని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టంచేసింది.

Updated : 31 Jan 2023 06:06 IST

అధికారాలను జాగ్రత్తగా వాడాలి

దిల్లీ: నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ)లోని సెక్షన్‌ 482 కింద తమకు దఖలుపడిన స్వతస్సిద్ధ అధికారాలను హైకోర్టులు చాలా జాగ్రత్తగా, అప్రమత్తతతో ఉపయోగించాలని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టంచేసింది. న్యాయాన్ని అందించడం కోసమే వాటిని వాడాలంది. ఆ అధికారాలను వాడకుంటే అన్యాయం జరుగుతుందనుకున్నప్పుడు వాటిని ప్రయోగించాలని సూచించింది. ఒక కేసులో నిందితులపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయడానికి నిరాకరిస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.


జీ20 విదేశాంగ మంత్రుల భేటీకి దిల్లీ రానున్న లవ్రోవ్‌

మాస్కో: మార్చి 1, 2 తేదీల్లో దిల్లీలో జరిగే జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గె లవ్రోవ్‌ పాల్గొంటారు. భారత్‌ అధికారికంగా ఈ కూటమి అధ్యక్ష బాధ్యతలను గత ఏడాది డిసెంబరు 1న చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని 55 చోట్ల 200కుపైగా సమావేశాలను నిర్వహిస్తోంది. వీటి ద్వారా తన సాంస్కృతిక వారసత్వాన్ని చాటాలనుకుంటోంది.


దిల్లీలో ఏడు వాహనాలు ఢీ
చిన్నారులు సహా 24 మందికి గాయాలు

దిల్లీ: దేశ రాజధానిలోని సలీమ్‌ గఢ్‌ వంతెన వద్ద సోమవారం మూడు వాహనాలను నాలుగు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 24 మందికి గాయాలయ్యాయి. 216మంది విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన నాలుగు బస్సులు జూ, అక్షర్‌ధామ్‌ ఆలయ సందర్శనకు వెళ్తున్నాయి. ఓ బస్సు అదుపు తప్పి మరో మూడు బస్సులను ఢీ కొట్టింది. ఆ మూడు బస్సులు ఆటోరిక్షా, కారు, ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టాయి. ఈ క్రమంలో 24మందికి గాయాలు అయ్యాయి. ఇందులో పాఠశాల విద్యార్థులతో పాటు ముగ్గురు పాఠశాల సిబ్బంది, ఒక పౌరుడు ఉన్నారు. క్షతగాత్రులను ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని దిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌ అధికారులను ఆదేశించారు.


వయనాడ్‌ పాఠశాలలో  100 విద్యార్థులకు అస్వస్థత

వయనాడ్‌: కేరళలోని వయనాడ్‌ జిల్లా లక్కిడి ప్రాంతంలో గల జవహర్‌ నవోదయ విద్యాలయకు సుమారు 100 మంది విద్యార్థులు కొన్ని రోజులుగా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు అస్వస్థతో వారాంతాన పెద్ద సంఖ్యలో వైత్తిరి తాలుకా ఆసుపత్రిలో చేరారు. ఈ పరిస్థితికి కలుషితాహారం కావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య విభాగానికి చెందిన నిపుణుల బృందం పాఠశాలను సందర్శించి నీటి నమూనాలను సేకరించింది. వాటిని కోజికోడ్‌లోని ప్రయోగశాలకు పరీక్ష కోసం పంపింది. విద్యార్థుల రక్త, మల నమూనాలను అలపుళలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌, మరో ప్రయోగశాలకు పంపింది.  


మతమార్పిళ్లను నియంత్రించే చట్టాలపై 3న సుప్రీం విచారణ

దిల్లీ: మతాంతర వివాహాల కారణంగా జరిగే మతమార్పిళ్లను నియంత్రించే వివాదాస్పద రాష్ట్ర చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ ఫిబ్రవరి 3న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఓ బదిలీ పిటిషన్‌ సహా సంబంధిత అన్ని వ్యాజ్యాలను అదే రోజు విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి సోమవారం సంక్షిప్తంగా విచారణ జరిగింది. ‘‘ఇలాంటి రాష్ట్ర చట్టాల వల్ల ప్రజలు వివాహాలు చేసుకోలేరు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది’’ అని తీస్తా సీతల్వాడ్‌కు చెందిన ‘సిటిజన్స్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌’ స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్‌ న్యాయవాది సీయూ సింగ్‌ నివేదించారు. రాష్ట్రాలు చేసిన చట్టాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారని, సంబంధిత కేసులను ఆయా రాష్ట్రాల హైకోర్టులు విచారించాలని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి పేర్కొన్నారు.


స్వలింగ వివాహ పిటిషన్లు సుప్రీంకోర్టుకు
దిల్లీ హైకోర్టు నిర్ణయం  

దిల్లీ: దేశంలోని వివిధ చట్టాల కింద స్వలింగ వివాహాలను గుర్తించాలంటూ దాఖలైన పిటిషన్లను దిల్లీ హైకోర్టు సోమవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇదే అంశంపై వివిధ హైకోర్టులలో దాఖలైన పిటిషన్లన్నింటినీ తానే విచారించడానికి సుప్రీంకోర్టు ఈనెల 6న వాటిని బదిలీ చేసుకుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలపడంతో దిల్లీ హైకోర్టు ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై మొత్తం 8 పిటిషన్లు హైకోర్టు ముందుకు వచ్చాయి. స్వలింగ వ్యక్తుల మధ్య ఆంతరంగికంగా ఏకాభిప్రాయంతో సంపర్కం జరగడాన్ని నేరంగా పరిగణిస్తున్న బ్రిటిష్‌ కాలంనాటి చట్టాన్ని 2018 సెప్టెంబరు 6న సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వం స్వలింగ వివాహాలను గట్టిగా వ్యతిరేకిస్తోంది. సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కాన్ని అనుమతిస్తోందని, అలాంటి వివాహాలను హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తించాలని కొందరు పిటిషనర్లు కోరారు. స్వలింగ వివాహాలను అనుమతించడానికి ప్రత్యేక వివాహ చట్టంలో అడ్డుగా ఉన్న అంశాలను తొలగించాలని ఇద్దరు మహిళలు పిటిషన్‌ వేశారు. అమెరికాలో తాము స్వలింగ వివాహం చేసుకున్నా భారత్‌లో తమ వివాహాన్ని విదేశీ వివాహాల చట్టం కింద నమోదు చేయడం లేదంటూ ఇద్దరు పురుషులు మరో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్లన్నీ సుప్రీం విచారణకు బదిలీ అయ్యాయి.


లక్షద్వీప్‌ లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక నిలిపివేత
ఎంపీపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో..

దిల్లీ: లక్షద్వీప్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఫిబ్రవరి 27న జరగాల్సిన ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. హత్యాయత్నం కేసులో ఆ నియోజకవర్గ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌ (ఎన్సీపీ)కి విధించిన శిక్షను కేరళ హైకోర్టు కొట్టివేయడంతో సోమవారం ఈసీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ శిక్ష కారణంగానే ఎంపీపై అనర్హత వేటు పడడంతో ఉప ఎన్నిక అవసరమైంది. నామినేషన్ల స్వీకారానికి గెజిట్‌ ప్రకటన మంగళవారం వెలువడాల్సి ఉంది. కవరత్తి సెషన్స్‌ న్యాయస్థానం విధించిన శిక్షపై ఫైజల్‌ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దానిపై వెలువడిన తీర్పు నేపథ్యంలో ఆయనపై అనర్హతను తొలగించాలని ఎన్సీపీ అధిపతి శరద్‌పవార్‌ సోమవారం లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను కలిసి విజ్ఞప్తిచేశారు. ఫైజల్‌ శిక్షను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఈ నెల 25న ఇచ్చిన తీర్పుపై లక్షద్వీప్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.


హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై ఉన్నతస్థాయి విచారణ అవసరం

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలకు సంబంధించి ఉన్నతస్థాయి విచారణ అత్యావశ్యకం. సుప్రీంకోర్టు రోజువారీ పర్యవేక్షణలో ఆ విచారణ జరగాలి. అసమానతల్లో భారీ పెరుగుదల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటోంది.

సీతారాం ఏచూరి


అదే మనకు సవాల్‌

జనాభా పెరుగుదల భారత్‌కు పెద్ద సానుకూలాంశంగా మారుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నా. అధిక జనాభా వల్ల వినియోగదారుల మార్కెట్‌ విస్తరిస్తుంది. కార్మికులు ఎక్కువగా అందుబాటులోకి వస్తారు. యువ వ్యాపారులు పుట్టుకొస్తారు. అయితే పెరుగుతున్న జనాభాకు అవసరమైన స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడం మన ముందున్న సవాల్‌.

హర్ష్‌ గోయెంకా


కరుణ నుంచే శాంతి, సంతోషం

కరుణ నుంచే నిజమైన శాంతి, సంతోషం     ఆవిర్భవిస్తాయి. మంచి హృదయానికి అది పునాది వంటిది. అర్థవంతమైన జీవిత సారాంశమూ అదే. మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు అనుసరించాల్సిన ప్రాథమిక సూత్రం కరుణే.

దలైలామా


అవీ తగ్గించాల్సిందే

ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌజ్‌ ఉద్గారాల్లో అల్పాదాయ దేశాల్లోని నగరాల వాటా స్వల్పమే. అయితే అవి కూడా వాటి ప్రస్తుత ఉద్గారాల స్థాయిని వేగంగా తగ్గించాల్సిందే. లేనిపక్షంలో 2050 కల్లా నెట్‌ జీరో స్థాయిని అందుకోవాలన్న అంతర్జాతీయ లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యం.

ప్రపంచ బ్యాంకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని