భారత్‌పై కొన్ని పాశ్చాత్య శక్తుల కంటగింపు

భారత ప్రగతిని కొన్ని పాశ్చాత్య శక్తులు హర్షించలేకపోతున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. అందుకే భారత్‌ ప్రగతిపై తరచూ వ్యతిరేక కథనాలు వస్తుంటాయన్నారు.

Published : 22 Mar 2023 05:17 IST

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

దిల్లీ: భారత ప్రగతిని కొన్ని పాశ్చాత్య శక్తులు హర్షించలేకపోతున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. అందుకే భారత్‌ ప్రగతిపై తరచూ వ్యతిరేక కథనాలు వస్తుంటాయన్నారు. నిజమైన లౌకికవాదమంటే మనదే అని చెప్పారు. మంగళవారం 29వ లాల్‌ బహదూర్‌శాస్త్రి స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జై జవాన్‌, జై కిసాన్‌ నినాదంతో ఆత్మనిర్భర్‌ భారత్‌కు శ్రీకారం చుట్టిన తొలివ్యక్తి లాల్‌ బహదూర్‌ శాస్త్రి అన్నారు. గొప్ప దార్శనికత గల శాస్త్రీజి పలు తరాలకు స్ఫూర్తిప్రదాతగా నిలిచినట్లు తెలిపారు. పార్లమెంటులో అధికారపక్ష, విపక్ష ఆందోళనల గురించి స్పందిస్తూ.. చర్చలు, నిర్ణయాలు జరగాల్సిన సభలో అంతరాయాలు మంచివి కాదన్నారు. మన దేశంలో వక్రబుద్ధి గల కొందరు పెద్దలు విదేశాలకు వెళ్లి బ్రిటిష్‌ పాలనే బాగుండేదని చెబుతుంటారని, అదృష్టవశాత్తు రాజకీయ  నేతలెవరూ  అలా చెప్పడం  లేదన్నారు.  ఆ పెద్దల పేర్లు చెప్పడం తనకు ఇష్టం లేదని వెంకయ్యనాయుడు తెలిపారు.


ఉగాది వేళ మాతృభాష సంకల్పం తీసుకోండి

ఈనాడు, దిల్లీ: ప్రకృతిలో మార్పు స్పష్టంగా కనిపించే ఈ వసంత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తూ మన పెద్దలు అందించినదే ఉగాది పండగని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది అందరి జీవితాల్లోకి నూతన శోభను తీసుకురావాలని, ఆయురారోగ్యాలను, సుఖ సంపదలను, ఆనందాన్ని అందించాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యాన్ని అందించే ఉగాది పచ్చడి, ఆనందాన్ని అందించే ఆత్మీయుల ఆగమనం మనిషికి నూతన ఉత్తేజాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరూ మన సనాతన మూలాల్లోకి తరలివెళ్లే సంకల్పం తీసుకోవాలనేది తన ఆకాంక్షని, భవిష్యత్‌ తరాలను మన సంస్కృతికి వారసులుగా తీర్చిదిద్దాలన్నది తన అభిలాషని పేర్కొన్నారు. ఉగాది వేళ మాతృభాష పరిరక్షణ, పరివ్యాప్తి మన లక్ష్యం కావాలని, ఇంటా బయట బడిలో, గుడిలో అమ్మఒడిలో నేర్చుకున్న మాతృభాషకు పెద్ద పీట వేయాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాతృభాషలోనే మాట్లాడాలని, మాతృ భాషలోని పద్యాలు, ఇతర విశేషాలను నేర్పి అమ్మ భాషకు పిల్లలను వారసులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు  కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

* మన హక్కులను గుర్తు చేస్తూనే ప్రకృతిపై మన బాధ్యతలను పండగలు గుర్తు చేస్తాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తెలుగు ప్రజలకు శోభకృత్‌ నామ ఉగాది శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. మన సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనంగా ఉగాది జరుపుకోవాలని ఆకాంక్షించారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని