సీఆర్ రావుకు అత్యున్నత పురస్కారం
ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త, భారతీయ-అమెరికన్ అయిన కల్యంపూడి రాధాకృష్ణారావుకు (సీఆర్ రావు) స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది.
స్టాటిస్టిక్స్‌లో నోబెల్ అంతటి గౌరవం
జులైలో కెనడాలో ప్రదానం
102 ఏళ్ల వయసులోనూ వర్సిటీలో సేవలు
వాషింగ్టన్: ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త, భారతీయ-అమెరికన్ అయిన కల్యంపూడి రాధాకృష్ణారావుకు (సీఆర్ రావు) స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకుగానూ ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన గణాంక బహుమతిని 2023 సంవత్సరానికి ఆయన అందుకోనున్నారు. 75 సంవత్సరాల క్రితం రావు చేసిన కృషి.. ఇప్పటికీ సైన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూనే ఉందని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే జులైలో కెనడాలోని అట్టావాలో జరిగే కార్యక్రమంలో సీఆర్ రావు ఈ అవార్డును అందుకుంటారు. 102ఏళ్ల సీఆర్ రావుకు అవార్డుతోపాటు 80వేల అమెరికన్ డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నారు. 1945లో కోల్‌కతా మేథమేటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది. 5 ప్రముఖ అంతర్జాతీయ గణాంక సంస్థల సహకారంతో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ బహుమతిని అందజేస్తారు.
బాల్యమంతా ఏపీలోనే..
సీఆర్ రావు 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లా హడగళిలో జన్మించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో ఆయన బాల్యం గడిచింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ గణితం చేసిన ఆయన యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతాలో ఎంఏ స్టాటిస్టిక్స్ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు. ఆయన 2020 సెప్టెంబరు 10న వందో పుట్టినరోజు జరుపుకొన్నారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.
హైదరాబాద్‌లోని సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ వ్యవస్థాపకులైన ఆయన సేవలు కేవలం స్టాటిస్టికల్ రంగానికే కాకుండా ఎకనమిక్స్, జెనెటిక్స్, ఆంత్రోపాలజీ తదితర రంగాలకూ విశేషంగా ఉపయోగపడినట్లు ఇటీవల వెబినార్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్న ఆయన ఇప్పటివరకూ 477 పరిశోధన పత్రాలు సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు. 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారం అందుకున్నారు. యూకే ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ బయోమెట్రిక్ సొసైటీకి అధ్యక్షుడిగా పని చేశారు. భారత స్టాటిస్టిక్స్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
ఏమిటీ పరిశోధనలు
సీఆర్ రావు తన పరిశోధనలో భాగంగా 1945లో మూడు ప్రాథమిక ఫలితాలను విశ్లేషించారు. ఇవి ఆధునిక గణాంక విధానానికి మార్గం సుగమం చేయడంతోపాటు సైన్స్‌లో ఈ గణాంక టూల్స్‌ను భారీగా వాడటానికి ఉపయోగపడ్డాయి. ఈ మూడింటిలో మొదటిది.. క్రామెర్-రావు లోయర్ బౌండ్. ఇది గణాంక పరిమాణాన్ని అంచనా వేయడంలో అత్యుత్తుమ విధానాన్ని సూచించింది. రెండవది రావు-బ్లాక్‌వెల్ సిద్ధాంతం. ఒక అంచనాను మెరుగైనదిగా మార్చడానికి ఉపయోగపడుతోంది. మూడోది సమాచార జామెట్రీ విస్తృతికి కొత్త ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్ అభివృద్ధి. ఇది డేటా నుంచి సమాచారాన్ని మరింత సమర్థంగా సేకరించేందుకు సహాయపడుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: ‘గ్యాంగ్’ ‘స్పెషల్ 26’ సినిమాలు చూసి.. సికింద్రాబాద్‌లో భారీ చోరి
-
World News
Moscow: మాస్కోపై డ్రోన్ల దాడి..!
-
Politics News
Chandrababu: వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు
-
India News
ఫోన్ కోసం రిజర్వాయర్‌నే తోడేసిన ఘటన.. పర్మిషన్ ఇచ్చిన అధికారికి జరిమానా!
-
Sports News
CSK vs GT: సీఎస్కేను భయపెట్టిన చెన్నై కుర్రాడు.. గుజరాత్ జట్టులో ‘ఇంపాక్ట్’ అతడు!
-
General News
Vijayawada: చట్టబద్ధంగా రావాల్సిన వాటి కోసం అడగడం తప్పా?: బొప్పరాజు