Supreme Court: స్పీకర్‌, గవర్నర్‌ల నిర్ణయం తప్పే

మహారాష్ట్ర పరిణామాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సంక్షోభ సమయంలో స్పీకర్‌, గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూనే స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని తేల్చి చెప్పింది.

Updated : 12 May 2023 07:42 IST

సరైన కారణం లేకుండానే కోశ్యారీ విశ్వాస పరీక్షకు ఆదేశించారు
మహారాష్ట్రలో పరిణామాలను తప్పుబట్టిన సుప్రీంకోర్టు
అలాగని ఠాక్రేను మళ్లీ సీఎంగా నియమించలేమని స్పష్టీకరణ
విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే ఆయన రాజీనామా చేశారని వెల్లడి

పార్టీలో సమస్యను ఆ పార్టీ రాజ్యాంగం ప్రకారం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఒక పార్టీలో వివాదాలను పరిష్కరించుకోవడానికి రాజ్యాంగంలోగానీ, పార్లమెంటు చేసిన చట్టాల్లోగానీ ప్రత్యేక ఏర్పాట్లేమీ లేవు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారాన్ని అవి గవర్నర్‌కేమీ ఇవ్వలేదు. అందువల్ల విడిపోయిన శివసేన వర్గం సంతకాలు చేసి ఇచ్చిన తీర్మానాన్ని గవర్నరు పరిగణనలోకి తీసుకోవడం తప్పే.

సుప్రీంకోర్టు

దిల్లీ: మహారాష్ట్ర పరిణామాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సంక్షోభ సమయంలో స్పీకర్‌, గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూనే స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని తేల్చి చెప్పింది. ఆయన విశ్వాస పరీక్షను ఎదుర్కొని ఉంటే పునరుద్ధరించే అంశం పరిశీలనకు వచ్చేదని అభిప్రాయపడింది. దీంతో భాజపా మద్దతుతో ఏర్పాటైన ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వం కొనసాగనుంది. శివసేనలో చీలికతో మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వ పతనంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలు ధర్మాసనంలో ఉన్నారు. వాదనల అనంతరం ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. ‘బల నిరూపణకు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని ఆదేశించడాన్ని అప్పటి గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సమర్థించుకోలేరు. ఠాక్రే మెజారిటీ కోల్పోయారని నిర్ధారణకు వచ్చేందుకు గవర్నర్‌వద్ద తగిన సమాచారం లేనప్పుడు.. మెజారిటీ నిరూపించుకోవాలని ఎలా ఆదేశిస్తారు. ఎంవీఏ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేలు బయటికి వస్తున్నారన్న సంకేతాలేవీ గవర్నర్‌ విశ్వాస పరీక్షకు ఆదేశించే సమయానికి లేవు. అయినా కొద్ది మంది ఎమ్మెల్యేలు అసమ్మతిని తెలియజేసినంత మాత్రాన గవర్నరు విశ్వాస పరీక్షకు ఆదేశించలేరు. సరైన అధారాల్లేకుండా గవర్నర్‌ తనకొచ్చిన సమాచారంతో ఆలోచించి ఒక అభిప్రాయానికి రాలేరు.

చట్ట ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రభుత్వం ఎన్నికైనప్పుడు సభలో విశ్వాసం ఉందనే అనుకుంటుంది. ఆ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందని చెప్పడానికి కచ్చితంగా అధారసహిత సమాచారం ఉండాల్సిందే. 2022 జూన్‌ 21న చేసిన తీర్మానంలో ఎమ్మెల్యేలెవరూ ఎంవీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. తమ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వారిలో అసంతృప్తే వ్యక్తమైంది. శివసేనలోనే మరో వర్గంగా ఏర్పడ్డారు. అలా పార్టీలో చీలికను ఆధారంగా చేసుకుని విశ్వాస పరీక్షకు ఆదేశించడం తగదు. శిందే వర్గానికి చెందిన భరత్‌ గోగ్వాలేను విప్‌గా స్పీకర్‌ నియమించడమూ చట్ట విరుద్ధమే. చీలిక వర్గం చేసిన తీర్మానం ఆధారంగా స్పీకర్‌ అలా చేయడం తప్పు. అయితే ఠాక్రే విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేయడంవల్ల యథాతథ స్థితిని పునరుద్ధరించలేం. ఆయనను సీఎంగా నియమించలేం’ అని ధర్మాసనం తరఫున రాసిన 141 పేజీల తీర్పులో సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. ‘2022 జూన్‌ 29న ఠాక్రే రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి పదవి ఖాళీ అయింది. దీంతో శిందే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అత్యధిక ఎమ్మెల్యేల మద్దతుతో ఫడణవీస్‌ తదితరులు ముందుకొచ్చారు. అప్పుడు గవర్నర్‌ సరైన నిర్ణయమే తీసుకున్నారు’ అని ధర్మాసనం పేర్కొంది.

రెబల్‌ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేసే అధికారాలు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న స్పీకర్‌కు ఉంటాయా.. లేదా.. అన్న అంశాన్ని మరింత అధ్యయనం చేయాల్సి ఉందని, అందుకే ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నామని పేర్కొంది. 2016లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన నబం రేబియా తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్దిష్ట సమయంలో స్పీకరే నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈ విషయంలో 10వ షెడ్యూలు ప్రకారం.. స్పీకర్‌, ఎన్నికల సంఘాలకే వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం ఉందని అభిప్రాయపడింది.

ఈ కేసు విచారణలో ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం తరఫున కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గం తరఫున హరీశ్‌ సాల్వే, ఎన్‌కే కౌల్‌, మహేశ్‌ జెఠ్మలానీ వాదనలు వినిపించారు.

2022 జూన్‌లో శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేకు మద్దతివ్వడంతో ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది.

స్పీకరు కోర్టులోనే బంతి

నిర్ణీత సమయంలో 16 మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకరుకు సుప్రీంకోర్టు సూచించడంతో ఇక బంతి ఆయన కోర్టులోకి వెళ్లిందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.


ఆలోచించే నిర్ణయం తీసుకున్నా

కోశ్యారీ

‘నేను చట్టపరమైన అంశాల్లో నిపుణుడిని కాదు. కానీ పార్లమెంటరీ, లెజిస్లేటరీ విషయాల్లో నాకు పరిజ్ఞానం ఉంది. ఆ మేరకు ఆలోచించే ఉద్ధవ్‌ను సభలో బల పరీక్షకు ఆదేశించా. గవర్నర్‌ పదవి నుంచి దిగిపోయి 3 నెలలైంది. రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. కోర్టు ఈ అంశంపై తీర్పు ఇచ్చింది. న్యాయ నిపుణులు వారి అభిప్రాయాలను చెబుతున్నారు’ అని మహారాష్ట్ర పూర్వ గవర్నర్‌ కోశ్యారీ వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టు తీర్పు తప్పా ఒప్పా అని చెప్పే పని నాది కాదు. అది సమీక్షకుల పని. ఎవరైనా రాజీనామా చేస్తానని నా దగ్గరకు వస్తే వద్దని చెప్పాలా’ అని ప్రశ్నించారు.


ముందు అసలైన శివసేన ఏదో తేలుస్తా

స్పీకర్‌ నర్వేకర్‌

అసెంబ్లీలో ముందుగా అసలైన శివసేన ఏదో సరైన సమయంలో తేలుస్తానని ప్రస్తుత స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ తెలిపారు. అన్ని వర్గాల వాదనలను విన్నాకే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తీర్పును స్వాగతిస్తున్నానని, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వివరాలు సమర్పించేందుకు అందరికీ అవకాశమిస్తానని, ఎగ్జామినేషన్‌, క్రాస్‌ ఎగ్జామినేషన్‌ అయ్యాక నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.


శిందే రాజీనామా చేయాలి.. ఉద్ధవ్‌

 

‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ఏక్‌నాథ్‌ శిందే అధికారంలోకి వచ్చారు. నైతిక బాధ్యతతో ఆయన రాజీనామా చేయాలి’ అని ఉద్ధవ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని తీర్పు మరింత పెంచిందన్నారు.  


ఆ అర్హత ఉద్ధవ్‌కు లేదు.. ఫడణవీస్‌

నైతికత గురించి మాట్లాడే అర్హత ఉద్ధవ్‌ ఠాక్రేకు లేదని ఉప ముఖ్యమంత్రి, బీజేపీ అగ్ర నేత దేవేంద్ర ఫడణవీస్‌ స్పష్టం చేశారు. సీఎం పదవి కోసం ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు నైతికత ఆయనకు గుర్తు రాలేదా? అని విమర్శించారు. అప్పటి మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల గురించి తాను మాట్లాడనని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని