దేశద్రోహం కేసుల్లో ఏడేళ్ల జైలుశిక్ష
దేశద్రోహం కేసుల్లో జైలు శిక్షను మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ సిఫార్సు
దిల్లీ: దేశద్రోహం కేసుల్లో జైలు శిక్షను మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. నేరస్థులు పాల్పడిన నేరాన్ని బట్టి వారికి శిక్ష విధించేందుకు ఈ చర్య కోర్టులకు వీలు కల్పిస్తుందని పేర్కొంది. సెక్షన్ 124ఎ (దేశద్రోహం) కింద నమోదైన కేసుల్లో భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కింద పేర్కొన్న శిక్ష అంత ప్రణాళికాబద్ధంగా లేదని కమిషన్ గతంలో సమర్పించిన ఓ నివేదికలో పేర్కొంది. ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు లేదా మూడేళ్ల జైలు శిక్షను పేర్కొంటోందని, ఆ మధ్యలో ఏమీ లేదని వెల్లడించింది. ఇక దేశద్రోహం కేసుల్లో కనీస శిక్ష ‘జరిమానా’ మాత్రమేనని తెలిపింది. ‘‘భారత శిక్షా స్మృతిలోని ఆరో చాప్టర్‌లో పేర్కొన్న నేరాలకు సంబంధించిన శిక్షలను పోల్చితే.. సెక్షన్ 124ఏ కింద పేర్కొన్న శిక్ష విషయంలో విస్పష్టమైన అసమానత ఉంది’’ అని కమిషన్ స్పష్టంచేసింది. అందువల్ల చాప్టర్-6 కింద ఉన్న ఇతర నేరాలకు సంబంధించి పేర్కొన్న శిక్షలకు అనుగుణంగా ఈ నిబంధనను సరిచేయాలని స్పష్టంచేసింది. అప్పుడు నేరం తీవ్రత ఆధారంగా శిక్షలు విధించేందుకు న్యాయస్థానాలకు వీలు కలుగుతుందని తెలిపింది.
మరింత అమానుషంగా మార్చేయాలనుకుంటోంది: కాంగ్రెస్
దేశద్రోహం చట్టాన్ని లా కమిషన్ సమర్థించడంపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం స్పందించింది. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత అమానుషంగా మార్చేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ చట్టాన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులపై ప్రయోగించాలని కూడా భావిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ధ్వజమెత్తారు.
ప్రభుత్వం సహేతుక నిర్ణయం తీసుకుంటుంది: మేఘ్‌వాల్
దేశద్రోహం చట్టం విషయంలో లా కమిషన్ నివేదికపై ప్రభుత్వం అన్ని అంశాలను, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఓ సహేతుక నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ పేర్కొన్నారు. ఈ విషయంలో అందరు భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతామని శుక్రవారమిక్కడ ఆయన వెల్లడించారు. నివేదికలోని సిఫార్సులు ‘సూచనాత్మకం’ మాత్రమేనని, కట్టుబడి ఉండాల్సినవి కావని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..