Railway Track: పట్టాలెందుకు తప్పుతున్నాయి?
రైల్వే ప్రమాదం అనగానే తరచూ వినిపించే పదం పట్టాలు తప్పిందని! తాజాగా ఒడిశా ఘటనలోనూ కారణాలు స్పష్టంగా తెలియకున్నా రైలు పట్టాలు తప్పిందనేది తెలిసిపోతోంది.
అత్యధిక ప్రమాదాలకు కారణమదే
రైల్వేకు సవాలుగా మారిన ట్రాక్ ఫ్రాక్చర్లు
రైల్వే ప్రమాదం అనగానే తరచూ వినిపించే పదం పట్టాలు తప్పిందని! తాజాగా ఒడిశా ఘటనలోనూ కారణాలు స్పష్టంగా తెలియకున్నా రైలు పట్టాలు తప్పిందనేది తెలిసిపోతోంది.
ఇదొక్కటనే కాదు... మన దేశంలో ప్రతి ఏటా రైల్వే ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం 2021లో 18 వేల రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఎక్కువ పట్టాలు తప్పటం వల్లే! అసలెందుకింతగా దేశంలో రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి? ఎందుకని రైళ్లు పదేపదే పట్టాలు తప్పుతున్నాయి?
డ్రైవర్లు, సిగ్నల్‌మ్యాన్ల పొరపాట్లు, కుట్ర కోణాల్లాంటి మానవ తప్పిదాలతో పాటు యాంత్రిక వైఫల్యాలను ప్రమాదాలకు కారణాలుగా చెబుతుంటారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిరుడు విడుదల చేసిన నివేదిక ప్రకారం... 2018-21 మధ్య చోటు చేసుకున్న రైలు ప్రమాదాల్లో ప్రతి పదింటిలో ఏడు- పట్టాలు తప్పటం వల్ల జరిగినవే! ఈ పట్టాలు తప్పటానికి ట్రాకుల్లో లోపాలు, నిర్వహణ సమస్యలు ప్రధాన సమస్యగా భావిస్తుంటారు.
ఎండదెబ్బకూ...
రైల్ (ట్రాక్) ఫ్రాక్చర్... ప్రమాదాలు జరిగినప్పుడల్లా తరచూ వినిపించే పదం ఇది. ముఖ్యంగా రైళ్లు పట్టాలు తప్పటానికి దీన్ని కీలకంగా చెబుతుంటారు. పట్టాలనేవి లోహాలతో చేసినవి. కొన్ని చోట్ల ఒకదానికొకటి వెల్డింగ్‌తోనో, బోల్టుల ద్వారానో కలిపి ఉంచేవి. నిత్యం రైలు చక్రాలతో ఘర్షణ కారణంగానో, లోహంలో లోపాల కారణంగానో, ఎక్కువ కాలం వాడటం వల్లో వీటిలో అక్కడక్కడా పగుళ్లు, చీలికల్లాంటివి తలెత్తుతుంటాయి. వీటినే ఫ్రాక్చర్ అంటారు. అంతేగాకుండా వాతావరణ మార్పుల వల్ల కూడా! ముఖ్యంగా వేసవి, శీతాకాలాల్లో వాతావరణ పరిస్థితుల కారణంగా రైల్వే ట్రాక్‌ల్లో ఏర్పడే సంకోచ, వ్యాకోచాల వల్ల కూడా ఈ ఫ్రాక్చర్లు ఏర్పడుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి... సరిచేయటం రైల్వే శాఖకు పెద్ద సవాలు. ఈ క్రమంలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ప్రమాదానికి దారితీయొచ్చు. ఎండనకా, వాననకా, రాత్రనకా, పగలనకా రైల్వే సిబ్బంది... వీటిని ఎప్పటికప్పుడు వేల కిలోమీటర్ల మేర, దేశవ్యాప్తంగా కనిపెట్టుకొని, మరమ్మతులు చేస్తూనే ఉంటారు. 2014లో రైల్వే శాఖ అంతర్గత నివేదికలో... ఈ ట్రాక్ ఫ్రాక్చర్లనేవి ఇంజినీరింగ్ (రైల్వే) విభాగానికి కత్తిమీద సాములా తయారయ్యాయని పేర్కొన్నారు.
నిర్వహణకు నిధులు లేవా?
కొత్త పట్టాలు వేయటానికి, పాతవాటిని ఆధునికీకరించటానికి రైల్వేలకు నిధులు అవసరం. ప్రపంచంలో అత్యంత పురాతనమైన రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వేలు నిర్వహణకు నిధులు సరిగ్గాలేక ఇబ్బందులు పడుతున్నాయంటారు. నిధుల కొరత ఉన్నా... అందుబాటులో ఉన్న నిధులను కూడా రైల్వే శాఖ సరిగ్గా వినియోగించుకోలేకపోతోందని కాగ్ నివేదిక ఎత్తిచూపింది. 2018-21 మధ్య 26శాతం రైళ్లు పట్టాలు తప్పటానికి ఇదే కారణమని కాగ్ విమర్శించింది.
* కొత్త రైళ్ల ప్రారంభంపై చాలాఖర్చు చేస్తున్నారు. కానీ... ఉన్న మౌలిక సదుపాయాల నిర్వహణ, ఆధునికీకరణలపై, రక్షణ వ్యవస్థలపై పెట్టాల్సినంతగా దృష్టిసారించటం లేదన్నది రైల్వేపై ప్రధాన ఆరోపణ.
* సాంకేతిక, ఆర్థిక సమస్యలు అలా ఉండగా.. నియమిత కాలపరిమితిలో చేపట్టాల్సిన పట్టాల నిర్వహణ మరమ్మతులకు సమయం సరిపోయినంతగా ఇవ్వకపోవటం అతి పెద్ద సమస్య అని రైల్వే లోకో రన్నింగ్ మెన్ సంఘం గతంలో ఆవేదన వ్యక్తంజేసింది. తక్కువ సమయంలో ఎక్కువ రైళ్లు నడపాలన్న ఒత్తిడి కారణంగా ఈ మరమ్మతులు, నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
* ఇందిరాగాంధీ ఓపెన్ వర్సిటీ 2018లో జరిపిన అధ్యయనం ప్రకారం... 2000-2016 మధ్య రైళ్లు పట్టాలు తప్పటం వల్ల కలిగిన ఆర్థిక నష్టం సుమారు రూ.86,486 కోట్లు.
మరి ఏం చేయాలి?
* అత్యంత క్లిష్టం, కీలకమైన పట్టాల నిర్వహణలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. తద్వారా ట్రాక్‌లో సమస్యలను వేగంగా గుర్తించి, పరిష్కరించటానికి వీలవుతుంది. ముఖ్యంగా రైల్వే ఫ్రాక్చర్లను గుర్తించటానికి సెన్సార్ ఆధారిత ఆటోమేటిక్ మిషిన్లను ప్రవేశపెట్టడం. కొంకణ్ రైల్వేలో 600 కిలోమీటర్ల మేర ఇలాంటి ఆస్ట్రేలియా సాంకేతికతను వినియోగించటం సత్ఫలితాలనిచ్చింది.
* జాతీయ నేర నమోదు విభాగం (ఎన్‌సీఆర్‌బీ)2022 నివేదిక ప్రకారం.. 2021తో పోలిస్తే రైల్వే ప్రమాదాలు 38.2% పెరిగాయి.
* మొత్తం 17,993 రైలు ప్రమాదాలు నమోదవగా వాటిలో అత్యధికంగా మహారాష్ట్ర (19.4శాతం), తర్వాత బెంగాల్‌లో జరిగాయి.
* 2021లో 17,993 ప్రమాదాలు జరగ్గా... 16,431 మంది మరణించారు. 1,852 మందికి గాయాలయ్యాయి.
* 11,036 మంది ట్రాక్‌లపై రైళ్లను ఢీకొనో, రైళ్ల నుంచి పడిపోయో మరణించారు.
* 2020లో 13,018 రైలు ప్రమాదాలు జరగ్గా.. 12వేల మంది ప్రయాణికులు మరణించారు. 2019లో భారత్‌లో రైలు ప్రమాదాల సంఖ్య 27,987గా నమోదైంది.
‘‘ప్రభుత్వం రైల్వేల నుంచి ఇంకా ఎక్కువ ఆదాయం ఎలా పొందాలని మాత్రమే ఆలోచించకుండా... రైల్వేలకు నిధులను ఎక్కువగా కేటాయించాలి.’’
రైల్వే మాజీ మంత్రి దినేశ్ త్రివేది
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kadapa: సచివాలయంలో సర్వేయర్‌పై వైకాపా కార్యకర్త దాడి
-
Jagan-adani: సీఎం జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ
-
రోజుకు నాలుగు గంటలు ఫోన్లోనే.. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వాడకం
-
Hyderabad: వర్షంలోనూ కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనాలు
-
ISRO Chief: సోమనాథ్ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు
-
Chandramukhi 2 Review: రివ్యూ: చంద్రముఖి-2