మహిళా బిల్లులో ఏముంది?

మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రవేశపెట్టిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగంలోని 239ఏఏ, 330, 332, 334 అధికరణలకు సవరణలు చేస్తున్నారు.

Updated : 20 Sep 2023 07:54 IST

పలు అధికరణలకు సవరణలు
కేంద్ర, రాష్ట్రాల్లో కోటాకు ఏర్పాట్లు

ఈనాడు, దిల్లీ: మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రవేశపెట్టిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగంలోని 239ఏఏ, 330, 332, 334 అధికరణలకు సవరణలు చేస్తున్నారు.

  • ఆర్టికల్‌ 239ఏఏ క్లాజ్‌ (2), సబ్‌క్లాజ్‌ (బి)కింద కొత్తగా బీఏ, బీబీ, బీసీ క్లాజులను చేర్చారు.
  • ఆర్టికల్‌ 330 కింద కొత్తగా 330ఏ(1)(2)(3)ని చేర్చారు.
  • ఆర్టికల్‌ 332 కింద 332ఏ (1)(2)(3)క్లాజ్‌లు చేర్చి దిల్లీ అసెంబ్లీ, దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, వాటి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించారు.
  • ఆర్టికల్‌ 334లో కొత్తగా 334ఏ(1) చేర్చి ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లన్నీ ఈ చట్టం అమల్లోకి వచ్చాక చేపట్టే జనగణన అనంతరం నిర్వహించే డీలిమిటేషన్‌ ప్రక్రియ తర్వాతే అమల్లోకి వచ్చేలా చూశారు. అప్పటివరకు ఇప్పుడున్న సీట్లన్నీ యథాతథంగా కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు. రాష్ట్రాలు, జాతీయ స్థాయిల్లో జరిగే విధాన రూపకల్పనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకే ఈ బిల్లు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం ఈ బిల్లు ఉద్దేశాలు, కారణాల్లో (ఆబ్జెక్టివ్స్‌ అండ్‌ రీజన్స్‌)లో పేర్కొంది. ‘75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత దేశం 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్‌గా అవతరించాలన్న లక్ష్యంతో అమృత్‌ కాలంలోకి ప్రవేశించింది. ఈ లక్ష్యాన్ని సాకారం చేసుకోవాలంటే సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాల చేయూత అవసరం. జనాభాలో సగభాగం ఉన్న మహిళల పాత్ర ఇందుకు అత్యంత ప్రధానం. మహిళా సాధికారిత, మహిళాధారిత అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మహిళల శక్తిని వెలికితీయడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. దానివల్ల మహిళల ఆర్థిక స్వాతంత్య్రం, విద్య, ఉద్యోగావకాశాలను అందుకోవడంలో ఎంతో మెరుగుదల కనిపించింది. ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్‌ కింద మరుగుదొడ్ల నిర్మాణం, ముద్ర యోజనతో ఆర్థిక సమ్మిళితత్వంలాంటి కార్యక్రమాల ద్వారా మహిళల జీవనాన్ని సుగమం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే విధానాల రూపకల్పన, నిర్ణయాధికార ప్రక్రియలో మహిళలు పెద్ద సంఖ్యలో భాగస్వాములైనప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుంది.పంచాయతీరాజ్‌ సంస్థలు, మున్సిపల్‌ వ్యవస్థల్లో మహిళల భాగస్వామ్యం పెద్దసంఖ్యలో ఉంది. అయితే అసెంబ్లీలు, పార్లమెంటులో వారి భాగస్వామ్యం ఇప్పటికీ పరిమితమే. రాష్ట్ర, జాతీయ స్థాయిలో వారికి అధిక ప్రాతినిధ్యం కల్పించాలన్న డిమాండు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఇదివరకు పలు ప్రయత్నాలు జరిగాయి. 2010లో చివరిసారి అలాంటి ప్రయత్నం జరిగింది. అప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లును రాజ్యసభ ఆమోదించినా లోక్‌సభ ఆమోదించలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే విధానాల రూపకల్పనలో ప్రజాప్రతినిధులుగా మహిళలకు అధిక భాగస్వామ్యం కల్పించడానికి దాదాపు మూడోవంతు సీట్లను వారికి కేటాయించడానికి ఇప్పుడు తాజాగా రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలన్న నిర్ణయం జరిగింది’ అని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులో పేర్కొంది.

2010 బిల్లులో లేని నిబంధన కొత్తగా..

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఉభయ సభల ఆమోదం పొంది చట్టరూపం సంతరించుకున్నా మహిళలకు వెంటనే ఆ ఫలాలు అందే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టిచూస్తే ఇవి 2029 సార్వత్రిక ఎన్నికల్లోనో, ఆ తర్వాతో అమల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం బిల్లులో పెట్టిన నిబంధనలే. ఈ బిల్లు ద్వారా రాజ్యాంగంలో కొత్తగా 334ఏ క్లాజ్‌ చేరుస్తున్నారు. దాని ప్రకారం ఈ బిల్లు చట్టరూపం సంతరించుకున్న తర్వాత చేపట్టే మొదటి జనాభా లెక్కల సేకరణ తర్వాత నియోజకవర్గాలను పునర్విభజించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటుచేసి కసరత్తు చేయాలి. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లులో ఈ నిబంధన లేదు. ఇప్పుడు కొత్తగా డీలిమిటేషన్‌ నిబంధన పెట్టడంవల్ల ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ లోక్‌సభ, అసెంబ్లీల్లో ఇప్పుడున్న సీట్లు యథావిధిగా కొనసాగుతాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణ మొదలుపెట్టి, దాన్ని పూర్తి చేసి నోటిఫై చేయడానికి కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. 


కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను పెంచి దాంతోపాటే ఈ మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ  ఉద్దేశంతోనే బిల్లులో డీలిమిటేషన్‌ క్లాజ్‌ పెట్టి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. తాజాగా ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో 128వ రాజ్యాంగ సవరణ బిల్లు-2023 చట్ట రూపం సంతరించుకున్న తర్వాత మొదలుపెట్టే తొలి జనగణన అనంతరం నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని