icon icon icon
icon icon icon

ఇంటి నుంచి ఓటు.. అర్హులు ఎవరు? దరఖాస్తు ఎలా?

లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది.

Updated : 19 Apr 2024 19:20 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా 85ఏళ్లు పైబడినవారు, 40శాతానికిపైగా అంగ వైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. పోలింగ్‌ సిబ్బంది ఓటరు ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారు. నిబంధనలకు అనుగుణంగా ఓ కంపార్టుమెంట్‌, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ను తెస్తారు.


ఏం చేయాలంటే..

ఇంటి నుంచే ఓటేసే వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వృద్ధులు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన 5 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఫారం 12డి నింపి రిటర్నింగ్‌ అధికారికిగానీ, సహాయ రిటర్నింగ్‌ అధికారికిగానీ పంపించాలి. దరఖాస్తు చేసుకునేవారు తమ పూర్తి చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు పొందుపరచాలి. ఈ దరఖాస్తు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

దరఖాస్తులను అందుకున్న తర్వాత సంబంధిత దరఖాస్తుదారుల ఇళ్లకు బూత్‌ స్థాయి అధికారులు వెళ్తారు. అర్హతలను బట్టి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. అనంతరం పూర్తి చేసిన ఫారం 12డీని రిటర్నింగ్‌ అధికారికి అందజేస్తారు. అర్హత ఉంటే దరఖాస్తుదారుల ఇంటికి అధికారులే వెళ్లి ఓటు వేయిస్తారు. పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసేటప్పుడు ఎలాగైతే రహస్య ఓటింగ్‌ ఉంటుందో ఇంటి నుంచే ఓటు వేసేటప్పుడూ అలాగే అన్ని చర్యలు తీసుకుంటారు.


1.73 కోట్ల మందికి అవకాశం

40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఓటర్లు దేశంలో 88.4 లక్షల మంది ఉన్నారని ఈసీ ఇటీవలే తెలిపింది. 85 ఏళ్ల వయసు పైబడిన వారు 82 లక్షల మంది ఉన్నారని పేర్కొంది.
వందేళ్లకుపైబడిన వారు 2.18 లక్షల మంది ఉన్నారని స్పష్టం చేసింది. వీరంతా కలిసి మొత్తం 1.73 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ ఇంటి నుంచి ఓటు అవకాశం కల్పించనున్నట్లు సీఈసీ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img