కొత్త వేరియంట్‌.. అత్యంత ప్రమాదకారి

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ప్రాథమిక ఆధారాల మేరకు.. దీని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండొచ్చని

Published : 30 Nov 2021 05:11 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

జెనీవా: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ప్రాథమిక ఆధారాల మేరకు.. దీని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో సభ్య దేశాలన్నింటికీ అప్రమత్తత లేఖ జారీ చేసింది.

దక్షిణాఫ్రికాలో మొదట వెలుగుచూసిన రకం గురించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ.. ఇది ప్రపంచం అంతటా విస్తరించేందుకు అత్యధిక అవకాశాలున్నాయని పేర్కొంది.

నూతన ఒప్పందం అవసరం: టెడ్రోస్‌

భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను కలిసికట్టుగా పోరాడేందుకు అంతర్జాతీయ సమాజం తోడ్పాటు అందించాలని... ఇందుకు నూతన ఒడంబడిక అవసరమన్న విషయాన్ని కొత్త వేరియంట్‌ చాటిచెబుతోందని  డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఉద్ఘాటించారు! దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్‌ ప్రమాదకరమని భావిస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీని ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో ద్వారా మాట్లాడారు. భవిష్యత్తులో మహమ్మారులపై పోరాటానికి అవసరమైన ‘ప్రపంచ కార్యాచరణ ప్రణాళిక’ను రూపొందించే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్‌ పినెరా తదితరులు పాల్గొన్నారు. మహమ్మారులపై అంతర్జాతీయ ప్రతిస్పందనలను పెంచేలా వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించింది. మహమ్మారులు తలెత్తినప్పుడు ప్రపంచ ప్రతిస్పందనను పెంచేలా, సభ్య దేశాలు చట్టబద్ధంగా కట్టుబడి ఉండేలా దీన్ని ప్రతిపాదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని