Covid Treatment:కొవిడ్‌కు చౌకైన ఆర్‌ఎన్‌ఏ చికిత్స

డెల్టా సహా కరోనాలో అనేక రకాల వేరియంట్ల నుంచి సమర్థ రక్షణ కల్పించే ఆర్‌ఎన్‌ఏ చికిత్సను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది శరీరంలోని మొదటి అంచె యాంటీవైరల్‌ రక్షణ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది

Published : 05 Jan 2022 09:18 IST

కొత్త విధానాన్ని కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌: డెల్టా సహా కరోనాలో అనేక రకాల వేరియంట్ల నుంచి సమర్థ రక్షణ కల్పించే ఆర్‌ఎన్‌ఏ చికిత్సను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది శరీరంలోని మొదటి అంచె యాంటీవైరల్‌ రక్షణ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది. ఎలుకల్లో నిర్వహించిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న కొవిడ్‌-19 బాధితులకు ఇది ఊరట కల్పిస్తుంది. ప్రస్తుతం టీకాలు అందుబాటులో లేని అనేక వర్ధమాన దేశాలకు ఇది చౌకైన చికిత్స మార్గమవుతుంది.

ఏమిటీ చికిత్స?
అనేక అల్పాదాయ దేశాల్లో టీకాల లభ్యత పరిమితంగా ఉంది. మరోవైపు వ్యాక్సిన్లను ఎదుర్కొనే కరోనా రకాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నియంత్రణకు టీకాలతో పాటు సమర్థ చికిత్సల ఆవశ్యకత ఏర్పడిందని పరిశోధనలో పాలుపంచుకున్న అకీకో ఇవాసాకి తెలిపారు.
* కరోనా సోకినప్పుడు ఒక వ్యక్తిలోని యాంటీబాడీలు, టి కణాలు రంగంలోకి దిగడానికి ముందు ఆర్‌ఐజీ-1 అనే రిసెప్టార్‌ రేణువులు మొదటి అంచె రక్షణ వ్యవస్థగా అక్కరకొస్తాయి.
* ఈ రిసెప్టార్లు జన్యు పదార్థం ఆధారంగా వైరస్‌ను గుర్తించి, టైప్‌-1 ఇంటర్‌ఫెరాన్లు అనే సంకేత ప్రొటీన్లను ఉత్పత్తి చేయిస్తాయి. ఈ ఇంటర్‌ఫెరాన్లు.. వైరస్‌ పునరుత్పత్తిని అడ్డుకునే ప్రొటీన్లను వెలువడేలా చేస్తాయి. ఇన్‌ఫెక్షన్‌పై పోరాడటానికి రోగ నిరోధక కణాలనూ రంగంలోకి దించేలా చూస్తాయి.
* ఈ ఇంటర్‌ఫెరాన్లు వేగంగా, అధిక సంఖ్యలో ఉత్పత్తి అయితే కొవిడ్‌ నుంచి రక్షణ లభిస్తుందని, ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుందని ఇప్పటికే వెల్లడైంది.
* వ్యాధి తొలిదశలోనే.. శుద్ధి చేసిన ఇంటర్‌ఫెరాన్‌ ప్రొటీన్‌తో చికిత్స చేస్తే రోగులకు మరణం ముప్పు తగ్గుతుందని ఇప్పటికే తేలింది. అయితే ఈ ప్రొటీన్ల తయారీ చాలా ఖరీదైన ప్రక్రియ.

చౌకైన ప్రత్యామ్నాయంతో.. యేల్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.. కరోనా వైరస్‌లోని జన్యు పదార్థాన్ని అనుకరించే ఎస్‌ఎల్‌ఆర్‌14 అనే ఒక రకం ఆర్‌ఎన్‌ఏ రేణువుల రూపంలో చౌకైన ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తెచ్చారు. ఇవి ఆర్‌ఐజీ-1 రెసెప్టార్‌ను క్రియాశీలం చేస్తాయి. ఫలితంగా రోగి శరీరంలోని సొంత కణాలే టైప్‌-1 ఇంటర్‌ఫెరాన్లను ఉత్పత్తి చేస్తాయి. కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశమున్న మూషికాలపై దీన్ని విజయవంతంగా పరీక్షించారు. ఆ జీవులకు డెల్టా సహా పలు వేరియంట్ల నుంచి రక్షణ లభించినట్ల వెల్లడైంది. అయితే ఒమిక్రాన్‌ వెలుగు చూడటానికి ముందు ఈ పరిశోధనను నిర్వహించారు. అందువల్ల ఆ రకం కరోనాపై ఈ విధానాన్ని పరీక్షించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని