లోక్‌అదాలత్‌లో రూ.25,320 కోట్ల విలువైన వివాదాలు పరిష్కారం

గతేడాది దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌ల ద్వారా కోటీ 27 లక్షల 87వేల 329 కేసులను పరిష్కరించినట్లు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ) పేర్కొంది. తద్వారా రూ.25,320 కోట్ల

Published : 25 Jan 2022 04:41 IST

ఏడాదిలో 1.27 కోట్ల కేసుల విచారణ ముగింపు

ఈనాడు, దిల్లీ: గతేడాది దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌ల ద్వారా కోటీ 27 లక్షల 87వేల 329 కేసులను పరిష్కరించినట్లు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ) పేర్కొంది. తద్వారా రూ.25,320 కోట్ల విలువైన వివాదాలు పరిష్కారమైనట్లు తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేట్రన్‌ ఇన్‌ చీఫ్‌గా, సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉన్న నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అధిక సంఖ్యలో జాతీయ లోక్‌ అదాలత్‌లు నిర్వహించేందుకు చర్యలు తీసుకొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వీడియోకాన్ఫరెన్స్‌ల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కక్షిదారులకు చేరువైంది. ఫలితంగా గతేడాది నిర్వహించిన నాలుగు జాతీయ లోక్‌ అదాలత్‌లలో 1,27,87,329 కేసులను పరిష్కరించగలిగింది. ఇందులో 55,81,117 పెండింగ్‌ కేసులు కాగా, 72,06,212 కేసులు ప్రీలిటిగేషన్‌కు చెందినవి. వీటిలో అత్యధికంగా రూ.7,356 కోట్ల విలువైన నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ కేసులు పరిష్కరించారు. తర్వాతి స్థానంలో బ్యాంకు రికవరీ కేసులు (రూ.5,466 కోట్ల విలువ) ఉన్నాయి. క్రిమినల్‌ కాంపౌండబుల్‌ అఫెన్స్‌ కేసులు, విద్యుత్తు, నీటి బిల్లులు, రెవెన్యూ, వివాహ సంబంధ వివాదాలు, కార్మిక, ఉద్యోగుల జీతాలు, భత్యాలు, రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలకు సంబంధించిన వివాదాలకూ పరిష్కారం చూపారు. కరోనా కాలంలో పెండింగ్‌ కేసుల సంఖ్య పెరిగి న్యాయ వ్యవస్థపై భారంగా మారినప్పటికీ లోక్‌ అదాలత్‌లలో భారీ సంఖ్యలో కేసులు పరిష్కరించడం వల్ల దాన్ని తగ్గించడానికి వీలైంది. ఇతర వివాద పరిష్కార వేదికల కంటే ఎక్కువగానే లోక్‌ అదాలత్‌ల ద్వారానే ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని