సరిహద్దు సమస్యను పరిష్కరించుకుందాం

ఉభయ దేశాల నడుమ నెలకొన్న సరిహద్దు సమస్యను బాధ్యతగా పరిష్కరించుకుందామని నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా... ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు. ఇందుకు ద్వైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుందామని ప్రతిపాదించారు.

Published : 03 Apr 2022 04:54 IST

ఇందుకు ద్వైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుందాం
మోదీకి నేపాల్‌ ప్రధాని దేవ్‌బా ప్రతిపాదన

దిల్లీ: ఉభయ దేశాల నడుమ నెలకొన్న సరిహద్దు సమస్యను బాధ్యతగా పరిష్కరించుకుందామని నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా... ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు. ఇందుకు ద్వైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుందామని ప్రతిపాదించారు. ఈ సమస్య రాజకీయం కాకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో కలిసి శుక్రవారం దిల్లీ చేరిన దేవ్‌బా... మోదీతో శనివారం భేటీ అయ్యారు. నేతలిద్దరూ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. సరిహద్దు సమస్య వీరి మధ్య ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినట్టు అధికారులు తెలిపారు.

బిహార్‌లోని జయనగర్‌, నేపాల్‌లోని కుర్తాల మధ్య తిరిగే తొలి బ్రాడ్‌గేజ్‌ ప్యాసింజర్‌ రైలును ప్రధానులిద్దరూ జెండా ఊపి ప్రారంభించారు. పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌, నేపాల్‌లో భారత రూపే చెల్లింపు కార్డులను కూడా వారు అందుబాటులోకి తీసుకొచ్చారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం నేతల్దిదరూ మీడియాతో మాట్లాడారు. ఉభయ దేశాల మధ్య సంబంధాలను మరింత విస్తృతం చేసేందుకు నిర్ణయించామనీ; రైల్వే, ఇంధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు నాలుగు ఒప్పందాలు కుదిరాయని నేతలు తెలిపారు. మోదీ మాట్లాడుతూ- ‘‘భారత్‌-నేపాల్‌ స్నేహ బంధం ప్రత్యేకమైనది. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి బంధం కనిపించదు. శాంతి, సంక్షేమం, అభివృద్ధి దిశగా నేపాల్‌ సాగిస్తున్న ప్రయాణంలో భారత్‌ తోడు కొనసాగుతుంది. నేపాల్‌ జలవిద్యుత్‌ అభివృద్ధి ప్రణాళికల్లో భారతీయ కంపెనీల భాగస్వామ్యం నిమిత్తం అంగీకారం కుదిరింది’’ అని పేర్కొన్నారు.

చిత్తరువును బహూకరించిన మోదీ...

దేవ్‌బాకు మోదీ సంప్రదాయ పహారీ స్కూల్‌ శైలి పేయింటింగ్‌ను బహుమతిగా అందజేశారు. శ్రావణమాసపు మేఘాల నడుమ రాధాకృష్ణులు ప్రేమపూర్వక సంభాషణలో నిమగ్నమైన ఇతివృత్తంతో హిమాచల్‌ప్రదేశ్‌ కళాకారులు ఈ చిత్తరువును రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని