ముంబయిని ముంచెత్తిన వానలు

దేశ ఆర్థిక రాజధాని ముంబయిని వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైళ్లు, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రానున్న 24 గంటల్లో ముంబయితో

Updated : 06 Jul 2022 06:19 IST

నీటమునిగిన రహదారులు, రైల్వే ట్రాక్‌లు

స్తంభించిన జనజీవనం

ముంబయి, దిల్లీ: దేశ ఆర్థిక రాజధాని ముంబయిని వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైళ్లు, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రానున్న 24 గంటల్లో ముంబయితో పాటు శివారు ప్రాంతాల్లో అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు ముంబయి నగరంలో 95.81 మిల్లీమీటర్లు, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 115 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. సియోన్‌, కుర్లా, తిలక్‌నగర్‌ వాడాలా రైల్వే స్టేషన్‌లో పట్టాలపై నీరు నిలిచిపోవడంతో లోకల్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సెంట్రల్‌ రైల్వే పౌర సంబంధాల అధికారి శివాజీ సుతార్‌ తెలిపారు. కొన్ని ప్రదేశాల్లో ట్రాక్‌పై నీరు నిలిచిపోవడంతో రైళ్లను నెమ్మదిగా నడుపుతున్నామని.. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నవీ ముంబయిలోని పన్వేల్‌, ఖండేశ్వర్‌, మానససరోవర్‌ రైల్వే స్టేషన్లు జలమయమైనట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ముంబయిలోని పలు రహదారులపై వరద చేరడంతో పలు బస్సులను దారిమళ్లించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్‌.. ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను రంగంలోకి దించింది.  కాగా రాయగఢ్‌ జిల్లాలోని తలా పట్టణంలో అత్యధికంగా 245 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.

వాతావరణ శాఖ దక్షిణ కొంకణ్‌, గోవాకు ఆరెంజ్‌ అలర్ట్‌.. ఉత్తర కొంకణ్‌, దక్షిణ మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్‌ను జారీచేసింది. పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ముంబయి, పరిసర జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఠాణెలో కూలిన బండరాళ్లు

మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఠాణెలోని కొండ ప్రాంతం నుంచి బండరాళ్లు పడిపోయినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా పాల్ఘడ్‌లోనూ ఓ ఇల్లు కూలిపోయిందని పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని.. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని వెల్లడించారు.  దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) పేర్కొంది. ఖరీఫ్‌ సాగు నేపథ్యంలో విత్తులకు సమయానికి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని