Updated : 07 Aug 2022 10:24 IST

స్వతంత్ర భారత ముఖ్య ఘట్టాలపై గూగుల్‌ ప్రాజెక్టు

దిల్లీ: ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కింద 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కీలక ఘట్టాలను రచనలు, వర్ణ చిత్రాల రూపంలో ప్రదర్శించే ఆన్‌లైన్‌ ప్రాజెక్టును గూగుల్‌ సంస్థ ప్రారంభించింది. ‘ఇండియా కీ ఉడాన్‌’గా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టును శుక్రవారం ఇక్కడ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి సమక్షంలో అధికారికంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా 10 మంది ఉత్తమ కళాకారులు సృజించిన 120 చిత్రాలు, 21 కథనాలను గూగుల్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. వీటితోపాటు కేంద్ర పర్యాటక శాఖ, మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ ఫోటోగ్రఫీ, భారతీయ రైల్వే హెరిటేజ్‌ విభాగం, ఇండియన్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌, దస్త్‌ కారీ హాట్‌ సమితికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనలనూ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. భారతదేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వం, ఆధునిక సాంకేతికతల సమ్మేళనం ఇండియా కీ ఉడాన్‌ ప్రాజెక్టులో ప్రదర్శితమవుతోందని గూగుల్‌ ప్రతినిధి సైమన్‌ రైన్‌ వివరించారు. ‘వచ్చే 25 ఏళ్లలో నా భారతదేశం’ అనే ఇతివృత్తంపై 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు వర్ణచిత్ర రచనా పోటీని గూగుల్‌ నిర్వహిస్తోంది. ఈ ‘డూడుల్‌4గూగుల్‌ పోటీ’లో విజేత గీసిన వర్ణ చిత్రాన్ని నవంబరు 14న గూగుల్‌ హోమ్‌ పేజీలో ప్రదర్శిస్తారు. ఆ విద్యార్థికి రూ.5 లక్షల కళాశాల ఉపకార వేతన ప్యాకేజీ ఇస్తారు. ఆ విద్యార్థి చదివిన పాఠశాల లేదా స్వచ్ఛంద సంస్థకు రూ.2 లక్షల విలువైన సాంకేతిక పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ అందిస్తారు. నలుగురు బృంద విజేతలు, ఫైనల్స్‌కు చేరిన 15 మందికి కూడా బహుమతులుంటాయి.గూగుల్‌ ఉద్యోగులు, ఇతరులు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడానికి ప్రోత్సహించే ఓ ప్రత్యేక డూడుల్‌నూ రూపొందించి ప్రదర్శించాలని గూగుల్‌ను కిషన్‌ రెడ్డి కోరారు. దేశంలో కేంద్ర ప్రభుత్వ రక్షణలో 3వేలకు పైగా చారిత్రక కట్టడాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయని, వాటి హద్దులకు సంబంధించిన డిజిటల్‌ మ్యాప్‌లు రూపొందించి కబ్జాల నుంచి రక్షణ కల్పించాలని, నిఘాకు వీలు కల్పించాలని మంత్రి కోరారు. అరుదైన పురా ప్రతులను డిజిటలీకరించి వాటిని చిరకాలం భద్రపరచడానికి తోడ్పడాలని సూచించారు. భారతదేశ పర్యాటక కేంద్రాల సంరక్షణలో గూగుల్‌ భాగస్వామి కావాలని పిలుపు ఇచ్చారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని