నుపుర్‌శర్మకు ఎట్టకేలకు ఊరట

మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మకు సుప్రీంకోర్టులో ఎట్టకేలకు ఊరట లభించింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటిని జతచేసి దిల్లీకి బదిలీ

Published : 11 Aug 2022 05:25 IST

 ఆమెపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు దిల్లీకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు

దిల్లీ: మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మకు సుప్రీంకోర్టులో ఎట్టకేలకు ఊరట లభించింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటిని జతచేసి దిల్లీకి బదిలీ చేయాలని బుధవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణ కొలిక్కి వచ్చేవరకు ఆమెపై తీవ్ర చర్యలు తీసుకోకూడదంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది. అయితే తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లు రద్దు చేయాలంటూ ఆమె చేసిన అభ్యర్థనపై మాత్రం.. న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జె.బి.పర్దీవాలా ధర్మాసనం దిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది. మహమ్మద్‌ ప్రవక్తపై ఓ టీవీ చర్చలో నుపుర్‌శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంతర్జాతీయంగానూ విమర్శలు చెలరేగాయి. దీంతో ఆమెను.. పార్టీనుంచి భాజపా సస్పెండ్‌ చేసింది. నుపుర్‌పై చర్యలు తీసుకోవాలంటూ దిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, అస్సాం, పశ్చిమబెంగాల్‌, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్లు నమోదయ్యాయి. వీటన్నింటిని దిల్లీకి బదిలీ చేయాలని గతంలో నుపుర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇదే ధర్మాసనం జులై ఒకటిన జరిగిన విచారణలో నుపుర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతారహితంగా ఆమె చేసిన వ్యాఖ్యలు.. దేశంలో మంటలు రేపాయని, నుపుర్‌ క్షమాపణ చెప్పాలంటూ మండిపడింది. దీంతో ఆమె తరఫు న్యాయవాది ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే న్యాయస్థానం వ్యాఖ్యల తర్వాత తనకు అత్యాచార, హత్య బెదిరింపులు ఎక్కువయ్యాయని, ఈ నేపథ్యంలో కేసులు దిల్లీకి బదిలీ చేయాలని మళ్లీ నుపుర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఆమెపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులు దిల్లీ పోలీసులకు చెందిన ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్‌, స్ట్రేటజిక్‌ ఆపరేషన్స్‌ (ఐఎఫ్‌ఎస్‌ఓ) విచారిస్తుందని పేర్కొంది. ఆల్ట్‌న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ జుబేర్‌ సహ ఇతర కేసుల్లో తీసుకున్న నిర్ణయాన్నే నుపుర్‌ విషయంలోనూ అనుసరిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. జులై 20న విద్వేష ప్రసంగాల కేసులో ముగ్గురుసభ్యుల ధర్మాసనం జుబేర్‌కు బెయిల్‌ ఉత్తర్వులిస్తూ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో అతనిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటిని దిల్లీకి బదిలీ చేయాలని ఆదేశించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts