Adani Row: ఆ బిలియనీర్‌ వ్యాఖ్యలు భారత్‌పై దాడే.. జార్జ్‌ సోరోస్‌ విమర్శలకు కేంద్రం ఘాటు రిప్లై

మన ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసేందుకు విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నాయని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ప్రధాని మోదీపై అమెరికా బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌(George Soros) చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా బదులిచ్చారు.

Updated : 17 Feb 2023 18:30 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani Group)పై హిండెన్‌బర్గ్‌ నివేదిక దేశ రాజకీయాలను కుదిపేస్తున్న వేళ.. అమెరికాకు చెందిన బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ జార్జ్ సోరోస్‌ (George Soros) భారత ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదానీ వ్యవహారం భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రేరేపిస్తోందని, దీనికి మోదీ జవాబు చెప్పాలని వ్యాఖ్యానించారు. అయితే సోరోస్‌ వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. మన ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసేందుకు విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) తీవ్రంగా మండిపడ్డారు.

జర్మనీలో జరుగుతున్న మ్యూనిచ్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో 92 ఏళ్ల జార్జ్‌ సోరోస్‌ (George Soros) గురువారం ప్రసంగించారు. ఈ సందర్భంగా అదానీ వ్యవహారాన్ని ప్రస్తావించిన ఆయన.. ‘‘మోదీ (Modi), అదానీ (Adani)కి దగ్గరి సంబంధాలున్నాయి. హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ గ్రూప్‌ కష్టాల్లో పడింది. దీంతో మోదీ బలహీన పడే అవకాశముంది’’ అని వ్యాఖ్యానించారు. అదానీ వ్యవహారం.. భారత్‌ (India)లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రేరేపిస్తోందని, దీనిపై ప్రధాని మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. ఈ ఆరోపణలపై విదేశీ మదుపర్లు అడుగుతున్న ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలన్నారు.

అయితే, సోరోస్‌ వ్యాఖ్యలకు స్మృతి ఇరానీ (Smriti Irani) ఘాటుగా బదులిచ్చారు. ‘‘జార్జ్‌ సోరోస్‌ కేవలం ప్రధాని మోదీపైనే కాదు.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ను దోచుకున్న ఆయనను ఆ దేశం ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు భారత ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలనే తన కోరికను బయటపెట్టారు. ఇలాంటి వారు ఇతర దేశాల్లో ప్రభుత్వాలను పడగొట్టి.. తమకు నచ్చిన వ్యక్తులను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడతారు. గతంలోనూ మన అంతర్గత వ్యవహారాల్లో ఇలాగే విదేశీ శక్తులు జోక్యం చేసుకోగా.. వారిని మనం ఓడించాం. ఈసారి కూడా అలాగే చేస్తాం. జార్జ్‌ సోరోస్‌ (George Soros)కు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకమవ్వాలి’’ అని స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు పరోక్ష హెచ్చరిక చేశారు. జార్జ్‌ సోరోస్‌ వ్యాఖ్యలకు మద్దతిచ్చే రాజకీయ సంస్థలకు ప్రజలే సరైన తీర్పునిస్తారని కేంద్రమంత్రి అన్నారు.

కాంగ్రెస్‌ ఖండన..

జార్జ్‌ సోరోస్‌ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్‌ (Congress) కూడా తీవ్రంగా స్పందించింది. ‘‘అదానీ వ్యవహారం భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దారితీస్తుందా అనేది పూర్తిగా కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీలు, మా ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. ఇందులో జార్జ్‌ సోరోస్‌ (George Soros)కు ఎలాంటి సంబంధం లేదు. సోరోస్‌ లాంటి వ్యక్తులు మన ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేరు’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైరాం రమేశ్‌ ట్విటర్‌లో స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని