Rahul Gandhi: భాజపా ముఖ్య సమస్యల్ని మేనేజ్‌ చేస్తూ.. ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తోంది: రాహుల్‌

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

Published : 07 Jul 2022 01:42 IST

దిల్లీ: వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. సామాన్యులపై భారం మోస్తూ.. దేశ ఆర్థిక వ్యవస్థను భాజపా దిగజారుస్తోందని విమర్శించారు. గృహ వినియోగ సిలిండర్‌ ధర రూ.50 పెరిగిన నేపథ్యంలో ఆయన ట్వీట్‌ చేశారు.  భాజపా అధికారంలోకి వచ్చాక ద్రవ్యోల్బణం పెరగడం, రూపాయి విలువ పతనం కావడం వంటి అంశాలను చూపిస్తూ ఉన్న ఓ ఫొటోను రాహుల్‌ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘భాజపా ప్రధాన సమస్యలను మేనేజ్‌ చేస్తూ.. ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తోంది’ అని ట్వీట్‌ చేశారు.

దేశంలో అవినీతి ప్రభుత్వం ఉంటే కరెన్సీ విలువ తగ్గిపోతుందని భాజపా గతంలో ప్రచారం చేసిందని రాహుల్‌ గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు రూపాయి విలువ రూ.79.36కు రికార్డు స్థాయికి పతనమైందన్నారు. ఇది సామాన్యులపై పెద్ద ‘దాడి’గా పేర్కొన్నారు. అలాగే, 2014లో ద్రవ్యోల్బణం ప్రధానాంశంగా ఉండేదని.. ఇప్పుడు దీనిపై ఎటువంటి చర్చ కూడా జరగట్లేదని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని భాజపా హామీ ఇచ్చిందన్న రాహుల్‌.. జూన్‌లో దాదాపు 1.3 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారంటూ ధ్వజమెత్తారు. తాజా ధర పెంపుతో దేశ రాజధాని దిల్లీలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,053కు పెరిగింది. హైదరాబాద్‌లో గ్యాస్‌ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని