NEET PG exam: నీట్‌ పీజీ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు వార్తల్ని నమ్మొద్దు‌: కేంద్రం

నీట్‌ పీజీ పరీక్ష(NEET PG 2023) రీషెడ్యూల్‌ చేసినట్టు వస్తోన్న వార్తల్ని నమ్మొద్దని కేంద్రం స్పష్టంచేసింది. అలాంటి సమాచారాన్ని ఎవరికీ షేర్‌ చేయవద్దని సూచించింది.

Updated : 07 Feb 2023 20:13 IST

దిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష- 2023(NEET PG 2023) తేదీని మార్చాలంటూ డిమాండ్లు వస్తోన్న వేళ  ఆ పరీక్షను రీషెడ్యూల్‌ చేసినట్టుగా జరుగుతోన్న దుష్ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. అదంతా దుష్ప్రచారమేనని.. ఎవరూ నమ్మొద్దని స్పష్టంచేసింది. మార్చి 5న జరగాల్సిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షలో మార్పులు జరిగాయని.. మే 21కి మార్పు చేసినట్టు పేర్కొన్న ఆ నోట్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘‘నీట్‌ పీజీ2023 పరీక్షను రీషెడ్యూల్‌ చేసినట్టుగా కొన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ఓ సందేశం సర్క్యులేట్‌ అవుతోంది. అది ఫేక్‌ సందేశం. ఇలాంటి నకిలీ సందేశాలను ఇతరులకు షేర్‌ చేయొద్దు’’ అని ట్విటర్‌లో కోరింది.

ఇంకోవైపు, నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేయాలంటూ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్(FAIMA) బృందంతో పాటు నీట్‌ పీజీ ఆశావహులు దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మంగళవారం నిరసనకు దిగారు. నీట్‌ పీజీ పరీక్ష వాయిదా వేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే ఖరారు చేసిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 5న కాకుండా మే లేదా జూన్‌ నెలల్లో పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులు చదువుకొనేందుకు సమయం దొరకడంతో పాటు ఎలిజిబిలిటీ విషయంలో ఇంటర్న్‌షిప్‌లో ఉన్నవారికి లబ్ది చేకూరుతుందని వైద్య సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. అందువల్ల తక్షణమే ఈ పరీక్షను వాయిదా వేసి భారీ సంఖ్యలో అభ్యర్థులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. నీట్‌ పీజీ పరీక్షలను వాయిదా వేయాలని ఇతర వైద్య సంఘాలు సైతం ముందుకు రావాలని, ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ఇప్పటికే FAIMA విజ్ఞప్తి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని