Noida Twin Towers: అంతా సిద్ధం! ఆ 40 అంతస్తుల టవర్లు ఎలా కూల్చుతారంటే..?

ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ (Noida twin towers) కూల్చివేతకు అంతా సిద్ధమైంది......

Published : 19 Aug 2022 20:20 IST

నోయిడా: ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ (Noida twin towers) కూల్చివేతకు అంతా సిద్ధమైంది. ఈ నెల 28న కూల్చివేయాలని సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌ విధించడంతో అధికారులు అందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఆగస్టు 28న (ఆదివారం) మధ్యాహ్నం  2.30గంటలకు ఈ బహుళ అంతస్తుల భవనాలను నేలమట్టం చేయాలని నిర్ణయించారు. అయితే, అంతకన్నా ముందు ఉదయం 7గంటలకే ఈ టవర్స్‌ సమీపంలో నివాసం ఉండే ప్రజల్ని ఖాళీ చేయించనున్నారు. 100 మీటర్ల ఎత్తైన భవనాలను కూల్చివేసే ప్రక్రియ జరుగుతున్న సమయంలో స్థానికులంతా దూరంగా ఉండాలని అధికారులు కోరారు.

ట్విన్‌ టవర్స్‌కు సమీపంలోని ఎమరాల్డ్‌ కోర్టు, ఏటీఎస్‌ విలేజ్‌ సొసైటీల్లో నివసించే వారంతా ఆగస్టు 28న ఉదయం 7గంటకల్లా ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. అదే రోజు సాయంత్రం 4గంటలకు వారంతా తిరిగి తమ ఇళ్లకు రావొచ్చని తెలిపారు. ఈ భవనాలను ఉన్నచోటే నేలమట్టం చేసేందుకు వీలుగా 9,400 రంధ్రాలు చేసి వాటిలో దాదాపు 3500 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను నింపనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ వారం ఆరంభంలోనే  పలు ట్రక్కుల్లో పేలుడు పదార్థాలను అక్కడికి తరలించినట్టు సమాచారం. ఈ జంట టవర్ల కూల్చివేత విషయంలో జనం భయపడుతున్నప్పటికీ.. నిపుణులు చేస్తున్నందున నమ్మకంతో ఉన్నారని ఆర్‌డబ్ల్యూఏ సూపర్‌టెక్‌ ఛైర్మన్‌ ఉదయ్‌ కుమార్‌ తెవాటియా తెలిపారు. యూకే నుంచి కూడా నిపుణుల్ని రప్పించామని.. అంతా సజావుగా జరగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పేలుడు ప్రభావం 50 మీటర్ల పరిధిలోనే ఉంటుందని ఆయన తెలిపారు. 

ఈ టవర్లు కూల్చివేత సమయంలో ఎమరాల్డ్‌ కోర్టు, ఏటీఎస్‌ విలేజీ సొసైటీల వైపు ఎలాంటి వాహనాలూ అనుమతించబోమని అధికారులు స్పష్టంచేశారు. వారి వాహనాల కోసం నోయిడా అథారిటీ పార్కింగ్‌ వసతి ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. గురువారం నోయిడా అథారిటీ కార్యాలయంలో ఈ టవర్లకు పక్కనే ఉన్న సొసైటీలకు చెందిన రెసిడెంట్‌ గ్రూపులు, కూల్చివేత సంస్థ ఎడిఫైస్‌ ఇంజినీరింగ్‌, స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు సమావేశమయ్యారు. తరలింపు ప్రణాళికను ఖరారు చేశారు. జంట టవర్లకు దగ్గరగా ఉన్న నోయిడా-గ్రేటర్‌ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేను ఆరోజు మధ్యాహ్నం 2.15గంటల నుంచి 2.45 గంటల వరకు వాహనాల రాకుండా మూసివేయాలని నిర్ణయించారు. అలాగే, కూల్చివేత ప్రదేశంలో అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సులు, ఇతర అత్యవసర సర్వీసులను అందుబాటులో ఉంచనున్నారు. 

నోయిడాలోని సెక్టార్‌ 93 ప్రాంతంలో సూపర్ టెక్‌ లిమిటెడ్ కంపెనీ 2009లో ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఈ భవనాల నిర్మాణం విషయంలో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డరు పెడచెవిన పెట్టారు. దీంతోపాటు అధికారులతో కుమ్మక్కై నిబంధనలు పాటించలేదు. దీనిపై స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు.. ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సెక్టార్‌ 93బిలో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. అయితే, ఈ భవనం కూల్చివేత ఆగస్టు 21న ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ నోయిడా అధికారులు చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ నెల 28కి పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నిర్దిష్ట తేదీ నుంచి సెప్టెంబర్‌ 4వరకు కూల్చివేత ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కొంది. సాంకేతికత, వాతావరణ పరిస్థితుల కారణంగానే కూల్చివేత తేదీని పొడిగించినట్లు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని