Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుతో రాజీవ్‌ గాంధీ కల నెరవేరింది: సోనియా గాంధీ

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు తాము మద్దతిస్తున్నామని కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలిపారు. ఈ బిల్లును త్వరితగతిన అమల్లోకి తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు.

Updated : 20 Sep 2023 15:16 IST

దిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు (Women's Reservation Bill)పై లోక్‌సభలో బుధవారం చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్‌ (Congress) అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) దీనిపై చర్చను మొదలుపెట్టి ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఈ నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ 2023 బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు.

‘‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు (Women's Reservation Bill)ను కాంగ్రెస్‌ సమర్థిస్తోంది. ఇది నాకు చాలా ఉద్వేగభరిత క్షణం. ఈ బిల్లును తీసుకురావడంతో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ స్వప్నం పూర్తిగా నెరవేరింది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలని నా భర్త రాజీవ్‌ గాంధీ ఆనాడు రాజ్యసభలో బిల్లు తీసుకొచ్చారు. కానీ, అది రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఆ తర్వాత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ బిల్లును అమల్లోకి తీసుకురాగలిగింది. దాని ఫలితమే, స్థానిక సంస్థల్లో ఇప్పటివరకు దాదాపు 15 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహించగలిగారు’’ అని సోనియా గాంధీ తెలిపారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ఏముంది?

‘‘ఈ బిల్లు ఆమోదం పొందాలని మేం ఆకాంక్షిస్తున్నాం. అయితే, కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి. మహిళలు రాజకీయ బాధ్యతలు చేపట్టాలని గత 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఎంతకాలం వేచిచూడాలి? ఈ బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకురావాలి. ఆలస్యమైతే మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఈ కోటాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించాలి. చట్టం సమర్థ అమలుకు తక్షణమే కులగణన చేపట్టాలి’’ అని సోనియా గాంధీ కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని