Indian Army: భారత్‌-చైనా సరిహద్దుపై ఆందోళన అనవసరం: ఆర్మీ కమాండర్‌

భారత్‌-చైనా సరిహద్దుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తూర్పు ఆర్మీ కమాండర్‌ ఆర్పీ కలిటా తెలిపారు. దేశం నలువైపులా భద్రత పటిష్ఠంగా ఉందన్నారు.

Published : 17 Dec 2022 01:52 IST

కోల్‌కతా: భారతదేశ సరిహద్దుల్లో భద్రత పటిష్ఠంగా ఉందని తూర్పు ఆర్మీ కమాండర్‌ (Eastern Army Commander) లెఫ్టినెంట్‌ జనరల్‌ ఆర్పీ కలిటా అన్నారు. భారత్‌-చైనా (India China boarder) సరిహద్దుపైనా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇరుదేశాల దళాల మధ్య అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని తవాంగ్‌ ప్రాంతంలో ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో కలిటీ ఈ వ్యాఖ్యలు చేశారు. 1971లో పాకిస్థాన్‌ (Pakistan) పై విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది డిసెంబరు 16న నిర్వహిస్తున్న విజయ్‌ దివస్‌ సందర్భంగా ఆర్మీ తూర్పు కమాండర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వాస్తవాధీన రేఖ విషయంలో భారత్‌, చైనా దేశాలకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. భారత్‌లో అంతర్భాగమైన దాదాపు 8 ప్రాంతాలపై పట్టు సాధించేందుకు చైనా దళాలు యత్నిస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాంతాలు తమ భూభాగం పరిథిలోకి వస్తాయని చైనా వాదిస్తోందన్నారు.

ఇటీవల భారత్‌, చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఇరు పక్షాల వారికి గాయాలయ్యాయని కలిటా తెలిపారు. సరిహద్దును దాటి చైనా సైనికులు భారత్‌వైపు దూసుకురావడంతో స్థానిక కమాండర్లు కలుగజేసుకొని మునుపటి పరిస్థితులు తీసుకొచ్చేందుకు యత్నించారని, ఈ క్రమంలో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుందని చెప్పారు. ఘర్షణ తర్వాత గానీ, అంతకుముందుగానీ భారత్‌ భూభాగంలోకి చైనా చొరబడిందా? అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటి దేమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌కు రక్షణ కల్పించేందుకు సైనికులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వెనకాడబోరని ఆయన అన్నారు. గత పది, పదిహేనేళ్లుగా సరిహద్దులో రోడ్డు, రైలు మార్గాల నిర్మాణ ప్రక్రియ వేగవంతమైందని, దీనివల్ల సరిహద్దు రక్షణ మరింత బలోపేతమవుతోందని అన్నారు. అంతేకాకుండా రక్షణ దళాలకు విధి నిర్వహణ సులభమవుతుందని కాలిటా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని