P-8I: నావికాదళానికి 10 పీ-8ఐ విమానం..!

భారత నావికా దళానికి మరో యాంటీ సబ్‌మెరైన్‌ వార్ఫేర్‌ యుద్ధవిమానం అందింది. బోయింగ్‌ సంస్థ తయారు చేసిన పీ-8ఐ విమానం మంగళవారం నావికాదళానికి చేరింది.

Published : 13 Jul 2021 21:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత నావికా దళానికి మరో యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ యుద్ధవిమానం అందింది. బోయింగ్‌ సంస్థ తయారు చేసిన పీ-8ఐ విమానం మంగళవారం నావికాదళానికి చేరింది. ఈ రకం విమానాలు ఎనిమిదింటిని కొనుగోలు చేసేందుకు భారత్‌ 2009లో ఒప్పందంపై సంతకం చేసింది. ఆ తర్వాత 2016లో మరో నాలుగు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకొంది. ఆ కాంట్రాక్టులో  రెండో విమానం నేడు వచ్చింది. దీంతో భారత నావికా దళం వద్దకు 10వ పీ-8ఐ వచ్చినట్లైందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిని సబ్‌మెరైన్ల వేటకు, సహాయ కార్యక్రమాలకు వినియోగిస్తామని పేర్కొంది. గతేడాది నవంబర్‌లో భారత నావికాదళం ఈ తరహాకు చెందిన ఒక విమానం అందుకొంది.  భారత నావికా దళంలోని ఈ విమానాలు 2013 నుంచి ఇప్పటి వరకు దాదాపు 30,000 గంటల పెట్రోలింగ్‌ నిర్వహించాయి. బోయింగ్‌ సంస్థ భారత సిబ్బందికి ఈ విమానం వినియోగం, వ్యూహాలపై శిక్షణ ఇస్తోంది. 

 ఒక్కసారిగా సబ్‌మెరైన్ల సంఖ్యను పెంచుకోవడం భారత్‌కు ఆర్థికంగా సాధ్యంకాదు. దీంతో పోల్చితే సబ్‌మెరైన్లను వేటాడే టెక్నాలజీ చౌక. అందుకే భారత్‌ ఈ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ వ్యూహంలో భాగంగానే సముద్ర గస్తీని పటిష్ఠం చేసే పీ-8ఐ మారిటైమ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను భారత్‌ కొనుగోలు చేసింది. సముద్ర జలాల్లో నక్కిన సబ్‌మెరైన్లను పసిగట్టడంలో ప్రపంచంలోనే ఇవి అత్యుత్తమమైనవి. హిందూ మహాసముద్రంలో చైనాను కట్టడి చేయడానికి అమెరికా వ్యూహాత్మకంగా వీటిని భారత్‌కు సమకూరుస్తోంది. దీంతోపాటు ‘ఎంహెచ్‌-60 రోమియో సీహాక్‌’ హెలికాప్టర్లను యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌గా, యాంటీ సర్ఫేస్‌ వెపన్స్‌ సిస్టంగా వాడేందుకు అమెరికా నుంచి భారత్‌ కొనుగోలు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని