Modi : భారత శక్తి పెరుగుతున్నందునే.. ఉక్రెయిన్‌ నుంచి తరలింపు సాధ్యమైంది!

ప్రపంచ వేదికపై భారత్‌ శక్తి సామర్థ్యాలు పెరగడం వల్లే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మన పౌరులను తరలించగలుగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 03 Mar 2022 01:49 IST

విపక్షాలపై మండిపడ్డ ప్రధాని మోదీ

లఖ్‌నవూ: ప్రపంచ వేదికపై భారత్‌ శక్తి సామర్థ్యాలు పెరగడం వల్లే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మన పౌరులను తరలించగలుగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. అక్కడ నుంచి మన పౌరులను తరలించేందుకు ఉన్న ఎటువంటి అవకాశాలనూ భారత్‌ వదులుకోదని స్పష్టం చేశారు. సాయుధ బలగాల పరాక్రమాన్ని ప్రశ్నించడంతో పాటు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’తో దేశం బలోపేతం కాదంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు ప్రధానమంత్రి కౌంటర్‌ ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోన్‌భద్రాలో పర్యటించిన మోదీ.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకువస్తామని ఉద్ఘాటించారు.

రణరంగంగా మారిన ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయును సురక్షితంగా తరలించేందుకు ‘ఆపరేషన్‌ గంగా’ కార్యక్రమాన్ని భారత్‌ కొనసాగిస్తోంది. ఇప్పటికే 2వేల మందిని స్వదేశానికి సురక్షితంగా తరలించగలిగింది. ఈ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయడంలో భాగంగా భారత వాయుసేన విమానాలనూ రంగంలోకి దించింది. రానున్న మూడు రోజుల్లోనే 26 విమానాల ద్వారా భారత పౌరులందరినీ స్వదేశానికి తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక ఉక్రెయిన్‌లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని మోదీ పలు దఫాలుగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నేరుగా సమన్వయపరిచేందుకు గానూ నలుగురు కేంద్ర మంత్రులను కూడా ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు పంపించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని