Rahul Gandhi: పీఎల్‌ఏ అధీనంలో ఉన్న భూమి ఎవరిది? : రాహుల్‌ గాంధీ

భారత్‌ భూభాగంలోకి ఎవరూ రాలేదన్న కేంద్రం ప్రకటనతో రాహుల్‌ గాంధీ (Rahul gandhi) విభేదించారు. మరోవైపు రష్యా- ఉక్రెయిన్‌ విషయంలో భారత్‌ విదేశాంగ విధానాలకు మద్దతిస్తున్నట్లు చెప్పారు.

Published : 05 Mar 2023 22:38 IST

దిల్లీ: చైనా బెదిరింపులు విదేశాంగ మంత్రి జైశంకర్‌కు అర్థం కావడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. బ్రిటన్‌ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదన్న ప్రధాని మోదీ ప్రకటన.. చైనాకు ఆహ్వానం పలికేలా ఉందని వ్యాఖ్యానించారు. లండన్‌లోని భారత జర్నలిస్టుల అసోసియేషన్‌ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత విదేశాంగ విధానానికి మద్దతిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానాలిచ్చారు. ‘ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం విషయంలో భారత్‌ స్తబ్ధుగా ఉంది. ఎవరి పక్షమూ వహించలేదు. ఒకవేళ చైనా, పాకిస్థాన్‌లు భారత్‌పై దండెత్తి వస్తే.. అప్పుడు ప్రపంచ దేశాలు కూడా పట్టనట్టు ఉంటాయి కదా?’ అని విలేకరులు అడగ్గా.. ఈ విషయంలో భారత విదేశాంగ విధానానికి తాను మద్దతిస్తున్నట్లు రాహుల్‌ గాంధీ చెప్పారు. రష్యా- ఉక్రెయిన్‌ విషయంలో భారత్‌ సరైన విధానాన్నే అనుసరించిందని చెప్పారు. దాంతో పెద్దగా విభేదించాల్సిన అవసరం లేదన్నారు.

2వేల చదరపు కి.మీ భూమి ఎవరిది?

భారత్‌లోకి చొరబాట్లు జరిగే ప్రసక్తే లేదని మోదీ చెబుతున్నారని రాహుల్‌ గాంధీ అన్నారు. ‘‘చొరబాట్లు జరగకపోవడం ఏంటి? ఇప్పటికే 2 వేల చదరపు కిలోమీటర్ల భారత్‌ భూభాగాన్ని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) స్వాధీనం చేసుకుంది. కానీ, మోదీ మాత్రం ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా భారత్‌ కోల్పోలేదని చెబుతున్నారు. ఇప్పుడు పీఎల్‌ఏ చేతుల్లో ఉన్న భూభాగం భారత్‌ది కాదా?’’ అని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. సరిహద్దులో చైనీయులు విద్వేష పూరితంగా, దూకుడుగా వ్యవహరిస్తున్నారన్న రాహుల్... భారత్‌ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. చైనాతో కాంగ్రెస్‌ విధానంపై మాట్లాడుతూ.. భారత్‌ భూ భాగంలోకి ఎవరినీ రానివ్వకుండా చేయడమే కాంగ్రెస్‌ విధానమని స్పష్టం చేశారు. ‘‘చైనా విషయంలో కాంగ్రెస్‌ విధానం చాలా స్పష్టంగా ఉంది. భారత్‌ భూభాగంలోకి ప్రవేశించేందుకు ఎవరినీ అనుమతించబోం. వాళ్లు ఎవరైనా సరే.. ఉపేక్షించేది లేదు. గతంలో భారత్‌ భూభాగంలోకి వచ్చిన చైనా దళాలు. భారత సైనికుల ప్రాణాలు తీశాయి. కానీ, దీనిని ప్రధాని మోదీ విస్మరించారు.’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

అంతకుముందు చైనా అంశంలో కేంద్ర ప్రభుత్వం తీరును రాహుల్‌ గాంధీ తప్పుబట్టడంపై భాజపా తీవ్రంగా స్పందించింది. లద్దాఖ్‌లో ఘటన జరిగిన తర్వాత అక్కడ సైన్యాన్ని మోహరించింది కాంగ్రెస్‌ నేతలు కాదని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ విమర్శించారు. ప్రధాని మోదీయే స్వయంగా పరిస్థితిని సమీక్షించి అక్కడికి సేనలను పంపారని అన్నారు. చరిత్రను గుర్తుంచుకోవాలన్న జై శంకర్‌.. 1962లో ఏ జరిగిందో తెలుసుకుంటే మంచిదని రాహుల్‌ గాంధీకి హితవు పలికారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. చైనా దళాలు భారత్‌ భూభాగం వైపు దూసుకొస్తుంటే ఏం చేసిందని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని