Prajwal Revanna: దేవెగౌడ మనవడికి షాక్‌.. ప్రజ్వల్‌ రేవణ్ణ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)పై అనర్హత వేటు పడింది. ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది.

Updated : 01 Sep 2023 18:10 IST

బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్‌ (JDS) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎంపీగా మాజీ ప్రధాని దేవెగౌడ (Deve Gowda) మనవడు, జేడీఎస్‌ నేత ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna) ఎన్నిక చెల్లదని కర్ణాటక హైకోర్టు (Karnataka HC) శుక్రవారం తీర్పు వెలువరించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్‌ సందర్భంగా ఆయన తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు కోర్టు ధ్రువీకరించింది. ఆయన వచ్చే ఆరేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత విధిస్తున్నట్లు హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది.

33 ఏళ్ల ప్రజ్వల్‌.. ప్రస్తుత పార్లమెంట్‌లో మూడో అతి పిన్న వయస్కుడైన నేతగా గుర్తింపు పొందారు. లోక్‌సభలో జేడీఎస్‌ తరఫున ఉన్న ఏకైక ఎంపీ కూడా ఈయనే. కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌.డి. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో హసన్‌ స్థానం నుంచి పోటీ చేసిన విజయం సాధించారు. అయితే, ఆ ఎన్నికల్లో ప్రజ్వల్‌ తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ సమర్పించారని ఆరోపిస్తూ రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఏమిటీ ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’?

హసన్‌ నియోజకవర్గ ఓటరు జి. దేవరాజెగౌడ, ఆ స్థానం నుంచి పోటీ చేసిన భాజపా అభ్యర్థి ఎ.మంజు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు.. ప్రజ్వల్‌ రేవణ్ణ అఫిడవిట్‌లో తన ఆస్తులను పూర్తిగా వెల్లడించకుండా ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని ధ్రువీకరించింది. అందువల్ల ఎంపీగా అతడి ఎన్నిక చెల్లదని నేడు తీర్పు వెలువరించింది.

అయితే, ప్రజ్వల్‌ అనర్హతతో హసన్‌ నుంచి తనను ఎంపీగా ప్రకటించాలని మంజు చేసిన అభ్యర్థనను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. మంజు కూడా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటుండటంతో హసన్‌ స్థానం నుంచి అతడు ఎన్నికైనట్లు ప్రకటించలేమని స్పష్టం చేసింది. ఇక, ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినందుకు గానూ.. ప్రజ్వల్‌ తండ్రి రేవణ్ణ, సోదరుడు సూరజ్‌పైనా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది.

జేడీఎస్‌ అధినేత దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ 2019లోనే ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. మనవడి కోసం దేవెగౌడ తన కంచుకోట అయిన హసన్‌ స్థానాన్ని త్యాగం చేసి తుముకూరు నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ ఆయన ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్‌ 6 స్థానాల్లో పోటీ చేయగా.. ప్రజ్వల్‌ మినహా ఎవరూ గెలవలేదు.

ఇదిలా ఉండగా.. ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ వేసిన మంజు.. ఆ తర్వాత భాజపాను వీడి జేడీఎస్‌లో చేరారు. ప్రస్తుతం జేడీఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని