Ramesh Kumar: ‘అత్యాచారాన్ని ఆనందించాలంటూ’ వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే క్షమాపణలు

అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు.. దాన్ని ఆనందంగా ఆస్వాదించడమే ఉత్తమమంటూ కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.రమేశ్‌ కుమార్‌

Updated : 17 Dec 2021 16:15 IST

బెంగళూరు: అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు.. దాన్ని ఆనందంగా ఆస్వాదించడమే ఉత్తమమంటూ కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన క్షమాపణలు తెలిపారు.

‘‘అత్యాచారం’ గురించి అసెంబ్లీలో నేను చేసిన ఉదాసీన, నిర్లక్ష్య వ్యాఖ్యలకు గానూ క్షమాపణలు తెలియజేస్తున్నా. రేప్‌ వంటి క్రూరమైన నేరాన్ని తేలికగా తీసుకోవాలనే ఉద్దేశంతో నేనా వ్యాఖ్యలు చేయలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. ఇక మీదట ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడుతాను’’ అని రమేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

గురువారం కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ రమేశ్‌ ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభలో ఆందోళన చేస్తోన్న ఎమ్మెల్యేల గురించి స్పీకర్ ప్రస్తావిస్తూ.. ‘‘నేను అన్నింటినీ ఆస్వాదిస్తూ అవును, అవును అనే పరిస్థితిలో ఉన్నాను’’ అని అన్నారు. వెంటనే రమేశ్‌ స్పందిస్తూ.. ‘‘అత్యాచారం అనివార్యమైనప్పుడు ఆనందంగా దాన్ని ఆస్వాదించాలి అని ఓ సామెత ఉంది. మీరిప్పుడు సరిగా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు’’ అని అన్నారు.

మండిపడిన రేఖాశర్మ..

కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ అసెంబ్లీలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు దాన్ని ఆనందంగా ఆస్వాదించడమే ఉత్తమం’ అంటూ ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన దేశంలోని ప్రతి మహిళకూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.  రమేశ్ కుమార్‌ చేసిన వ్యాఖ్య తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలో మహిళల సమస్యలకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎన్నుకోబడ్డారని గుర్తుచేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన దేశంలోని ప్రతి మహిళకూ క్షమాపణలు చెప్పాలన్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని రేఖా శర్మ డిమాండ్‌ చేశారు. అంతకముందు ఇదే అంశంపై ట్విటర్‌లో స్పందించిన రేఖాశర్మ.. ఆయన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. మహిళల్ని ద్వేషించే, వారి పట్ల భయంకరమైన మనస్తత్వం కలిగిన ప్రజాప్రతినిధులు ఇంకా ఉండటం దురదృష్టకరమన్నారు. ఇది చాలా అహస్యకరమని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని