Buggy: ‘పాక్‌తో టాస్‌ వేసి..’: రాష్ట్రపతి బగ్గీ మనకు ఎలా వచ్చిందో తెలుసా?

Buggy: దాదాపు 40 ఏళ్ల తర్వాత రాష్ట్రపతి మళ్లీ గణతంత్ర వేడుకలకు సంప్రదాయ బగ్గీని వినియోగించారు. ఈ బగ్గీ కోసం ఒకప్పుడు భారత్‌, పాక్‌లు పోటీపడ్డాయి. మరి ఇది మనకు ఎలా దక్కిందో తెలుసా?

Published : 26 Jan 2024 16:46 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో గణతంత్ర వేడుకలు (Republic Day) అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) కర్తవ్యపథ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే, వీరిద్దరూ బుల్లెట్‌ ప్రూఫ్‌ కాన్వాయ్‌లో కాకుండా.. సంప్రదాయ గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి భవన్‌ నుంచి వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో ఈ బగ్గీ (Buggy) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అవును మరి.. గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి దీన్ని ఉపయోగించడం 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే..! ఇంతకీ ఈ బగ్గీ మనకు ఎలా వచ్చింది? దీని వినియోగాన్ని ఎందుకు ఆపేశారు?

బ్రిటిష్‌ కాలం నుంచే..

ఆరు గుర్రాలతో లాగే ఈ బగ్గీ బ్రిటిష్‌ కాలం నుంచే మన దేశంలో ఉంది. అప్పట్లో దీన్ని భారత వైస్రాయి వినియోగించేవారు. అంచులకు బంగారు పూతతో మెరిసే దీనిపై అశోక చక్రం ముద్రించి ఉంటుంది. అప్పట్లో దీన్ని ప్రెసిడెన్షియల్‌ (వైస్రాయ్) ఎస్టేట్‌లో అటూ, ఇటూ తిరగడానికి విరివిగా ఉపయోగించేవారు.

టాస్‌ వేసి..

1947లో వలస పాలన ముగిసిన తర్వాత ఈ లగ్జరీ బగ్గీ కోసం భారత్‌, కొత్తగా ఏర్పాటైన పాకిస్థాన్‌లు పోటీపడ్డాయి. చివరకు దీన్ని ఎవరు తీసుకోవాలన్న దానిపై ఇరు దేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. భారత్‌కు చెందిన కల్నల్‌ ఠాకుర్‌ గోవింద్‌ సింగ్‌, పాకిస్థాన్‌కు చెందిన సాహబ్‌జాదా యాకుబ్‌ ఖాన్‌ కలిసి టాస్‌ వేశారు. ఇందులో కల్నల్‌ గెలవడంతో బగ్గీ భారత్‌కు దక్కింది. అప్పటినుంచి మన దేశ రాష్ట్రపతి కొన్ని అధికారిక కార్యక్రమాలకు దీన్ని వినియోగించడం మొదలైంది.

ఇందిరా గాంధీ హత్యతో..

1984 వరకు గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ఈ బగ్గీని ఉపయోగించేవారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా దీని వినియోగాన్ని నిలిపివేశారు. దీని స్థానంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ కాన్వాయ్‌ను తీసుకొచ్చారు. అయితే 2014, 2016లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బీటింగ్‌ రీట్రీట్‌ కార్యక్రమానికి ఈ బగ్గీలో వెళ్లారు. తాజాగా మళ్లీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గణతంత్ర వేడుకలకు దీన్ని ఉపయోగించారు. జనవరి 29న విజయ్‌ చౌక్‌ వద్ద జరిగే రిపబ్లిక్‌ డే ముగింపు వేడుకలకు కూడా ఆమె ఇందులోనే వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని